Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో ఇంకెంత మంది తేలతారో?

By:  Tupaki Desk   |   15 Aug 2015 5:33 AM GMT
భాగ్యనగరిలో ఇంకెంత మంది తేలతారో?
X
ఆగస్టు 15న సందర్భంగా హైదరాబాద్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయే ప్రమాదం ఉందన్న సమాచారంతో నగరంలో భారీగా చేపట్టిన సోదాలు.. తనిఖీలు ఫలితాన్ని ఇచ్చాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామియా కు చెందిన వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థను షార్ట్ కట్ లో హుజీగా వ్యవహరిస్తారు. ఆగస్టు 15 సందర్భంగా సంఘ విద్రోహక శక్తులు చెలరేగిపోవచ్చన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు విదేశీయులు.. ఇద్దరుస్థానిక ఏజెంట్లు.. పట్టుబడ్డారు. నలుగురు విదేశీయుల్లో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా.. ఒకరు పాకిస్థానీ.. మరొకరు మయన్మార్ దేశానికి చెందిన వారుండటం గమనార్హం.

దేశంలో అక్రమంగా ఉంటున్నవారికి హైదరాబాద్ కు చెందిన ఒక జిరాక్స్ షాపు యజమాని.. ఒక ఉపాధ్యాయుడు ఉండటం గమనార్హం. కాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నిషేధిక హుజీలో అగ్రనాయకుడిగా వ్యవహరిస్తున్న అబ్దుల్ జబ్బార్ ఉన్నారు.

నాసిర్ బంగ్లాదేశ్ కు చెందిన వాడు. 30 ఏళ్ల కిందట పాక్ లో స్థిరపడ్డాడు. తన సమీప బంధువు జబ్బార్ తో కలిసి హుజీలో అగ్రనాయకుడిగా వ్యవహరిస్తున్నారు. జబ్బార్ ఆదేశాలతో నాసిర్ తన భార్యతో కలిసి 2010లో దేశంలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మార్చిలో సైబరాబాద్ లోని జల్ పల్లిలో స్థిరపడ్డాడు. భార్యభర్తలు ఇద్దరూ స్థానికంగా యునాని వైద్యం అందిస్తూ.. ఆ ముసుగులో నగరంలో హుజీ ఉగ్రవాద కార్యకలపాలకు సాయం చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల నిందితుడైన పాకిస్థానీ వాక్వాస్ ను పశ్చిమబెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు పారిపోవటానికి నాసిర్ సాయాన్ని అందించాడు.

తాజాగా నాసిర్.. బాలపూర్ కు చెందిన ఉపాధ్యుడు సోహైల్ పర్వేజ్ ఖాన్ తో పరిచయం పెంచుకున్నాడు. సోహైల్ కు జిరాక్స్ సెంటర్ యజమాని మసూద్ ఆలీ ఖాన్ తో సంబంధాలున్నాయి. వీరంతా కలిసి బంగ్లాదేశ్.. పాకిస్థాన్.. మయన్మార్ దేశాలకు చెందిన వారికి ఆశ్రయం ఇవ్వటంతో పాటు.. స్థానిక చిరునామాలతో ఓటర్ ఐడీ కార్డులు.. ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.

ఇలా నకిలీ ఐడీ కార్డుల ద్వారా భారతదేశ పాస్ పోర్ట్ లు పొందిన 15 మంది విదేశీయులు దేశాన్ని వదిలిపోవటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా జరిపిన తనిఖీల్లో నాసిర్.. ఫైజల్ అహ్మద్.. అబేడిన్.. జియో ఉర్ రెహ్మానీ.. సోహైల్ పర్వేజ్ ఖాన్.. మసూద్ అలీలను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్ కు పంపారు.

వారి నుంచి నాలుగు భారత పాస్ పోర్టులు.. ఒక బంగ్లాదేశ పాస్ పోర్ట్ తోపాటు.. తొమ్మిది సిమ్ కార్డులున్న సెల్ ఫోన్లు.. జీహాద్ సాహిత్యం.. వంద నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ లెక్కన యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ మొత్తాన్ని పెద్ద ఎత్తున బలగాల సాయంతో జల్లెడ పడితే.. మరెన్ని విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తాయో..? ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిన హైదరాబాద్ విషయంలో నిఘా అధికారులు.. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెబుతుంది.