Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ మంత్రి సిగ్గుమాలిన మాట మాట్లాడి..

By:  Tupaki Desk   |   30 Oct 2020 4:30 PM GMT
పాకిస్థాన్ మంత్రి సిగ్గుమాలిన మాట మాట్లాడి..
X
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తూ వచ్చి చివరికి ఆ ఉగ్రవాద ఉచ్చులో బిగుసుకుని దారుణమైన నష్టాన్ని చవిచూస్తున్నప్పటికీ పాకిస్థాన్‌ ఎప్పుడూ బుద్ధి తెచ్చుకోలేదు. అధికారంలో ఎవరున్నా సరే.. ఉగ్రవాద సంస్థలతో అంటకాగడం మామూలే. ఇష్టం ఉన్నా లేకున్నా కూడా వారి చర్యలకు మద్దతుగా నిలవాల్సిందే. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు చేసే కుట్రల్లో స్వయంగా పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వం పాలు పంచుకుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పైకి మాత్రం ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నట్లు, తమకు ఉగ్రవాదులతో అసలే సంబంధం లేనట్లు కలరింగ్ ఇస్తుంటుంది పాక్ ప్రభుత్వం. ఐతే ఇప్పుడు సాక్షాత్తూ పాకిస్థాన్ అసెంబ్లీలో ఓ మంత్రి భారత్‌లోని పుల్వామాలో రక్షణ బలగాలపై జరిపిన పాశవిక దాడి తమ ఘనతే అని ప్రకటన చేసి జబ్బలు చరుచుకున్నారంటే ఆ దేశం ఎంతగా బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు.

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే దాడి జరుపుతామని భారత ప్రభుత్వం బెదిరించగానే పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారంటూ పాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒకరు ఎద్దేవా చేయగానే.. దానికి బదులిస్తూ అధికార పార్టీకి చెందిన సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌధరి ‘‘మనం భారత్ ను వారి గడ్డమీదే దెబ్బకొట్టాం. పుల్వామాలో మనం విజయం సాధించాం. ఇది ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ కు దక్కిన గెలుపు. ఈ విజయంలో మనమంతా భాగస్వాములమే.’’ అంటూ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించుకున్నారు. దీనికి అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందనలు కూడా తెలిపారు. ఐతే ఈ సమాచారం అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడంతో పాకిస్థాన్ ఇరుకునపడిపోయింది. అత్యుత్సాహంలో తాము చేసిన సిగ్గుమాలిన పని గురించి ప్రపంచానికి చెప్పేయడంతో పాకిస్థాన్ బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలిసిపోయింది. దీనిపై దుమారం రేగడంతో ఒక్క రోజు వ్యవధిలో మాట మార్చేశాడు ఆ పాక్ మంత్రి. పుల్వామా దాడితో పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ దాడి అనంతర పరిస్థితులనే తాను ప్రస్తావించానని.. తమ మాటలను వక్రీకరించారని.. ఉగ్రదాడుల్ని తాము ఖండిస్తున్నామని మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నాడు మంత్రి ఫవాద్.