Begin typing your search above and press return to search.

పాక్ జర్నలిస్టులకు శభాష్ చెప్పాల్సిందే బాస్

By:  Tupaki Desk   |   4 Oct 2019 12:09 PM GMT
పాక్ జర్నలిస్టులకు శభాష్ చెప్పాల్సిందే బాస్
X
పాత్రికేయం అంటే ప్రశ్నించటంగా చెప్పేటోళ్లు కొందరు కనిపిస్తారు. ప్రశ్నించటం.. సమాజానికి.. ప్రజలకు అండగా నిలుస్తూ వ్యవహరించే ధోరణి తగ్గిపోయిన వైనం ఈ మధ్యన చూస్తేనే ఉన్నాం. అన్నింటికి మించి అధికారపక్షం చేసే తప్పుల్ని ఎత్తి చూపే ధోరణి తగ్గిపోతోంది. ఒకవేళ.. ఆ ప్రయత్నం చేసినా.. గొంతు పెద్దది చేసి.. కళ్లు తిప్పుతూ ప్రశ్నించినంతనే ప్రశ్నించే తత్త్వాన్ని తగ్గించేస్తున్న పరిస్థితి.

ఇక.. భావోద్వేగ అంశానికి సంబంధించి గతానికి భిన్నంగా వ్యవహరించే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్న వాదన జోరుగా వినిపిస్తోంది. అలాంటి తీరుకు భిన్నంగా పాక్ జర్నలిస్టుల తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యంతో అవాక్కు అయ్యేలా చేస్తుందని చెప్పాలి. అందునా వారు ప్రశ్నించింది అల్లాటప్పా వారిని కాదు.. ఏకంగా తమ దేశ ప్రధానితో పాటు.. విదేశాంగ మంత్రిని.

తమ తప్పుల్ని.. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి తమకున్న పవర్ ను చూపించినా.. పలువురు పాక్ పాత్రికేయులు వెనక్కి తగ్గకుండా ప్రశ్నించిన తీరు చూస్తే.. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందనిపించక మానదు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ లో 58 దేశాలు కశ్మీర్ విషయంలో పాక్ కు మద్దతుగా నిలిచాయంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పేర్కొన్నారు.

అయితే.. కమిషన్ లో సభ్య దేశాలు 47 మాత్రమే. కమిషన్ లో ఉన్న దేశాలకు అదనంగా పదకొండు దేశాల్ని కలిపేసి మరీ.. తమకు భారీగా మద్దతుగా ఉన్నట్లుగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులపాలు అయ్యేలా చేశాయి. ఇమ్రాన్ కు ఏ మాత్రం తగ్గకుండా విదేశాంగ మంత్రి 50 దేశాలు మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొనటంతో వీరి తీరు కామెడీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాక్ జర్నలిస్టులు తమ విశ్వరూపం చూపారు. కశ్మీర్ అంశంపై ఏయే దేశాలు పాక్ కు మద్దతుగా నిలిచాయో చెప్పాలని ప్రశ్నించారు.

సదరు పాత్రికేయుడి ప్రశ్నకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తోక తొక్కిన తాచుపాములా కస్సుమన్నారు. మీరే ఏ దేశం తరఫున పని చేస్తున్నారు? అంటూ చిందులు తొక్కారు. తనను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నా.. సదరు జర్నలిస్టు వెనక్కి తగ్గకుండా.. ఖురేషి చేసిన 50 దేశాల మద్దతు ట్వీట్ ను గుర్తు చేశారు. దీంతో మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఐక్య రాజ్యసమితి లో ఏ దేశాలు పాక్ కు మద్దతు ఇస్తున్నాయో చెప్పమని అడుగుతున్నావా? మీకు నచ్చింది రాసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరి.. దేశప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యల్ని ట్విట్టర్ లో ఎందుకు సమర్థించారన్నప్పుడు.. తానేం అనలేదని.. ఎక్కడ అన్నానో చూపించాలన్నప్పుడు.. మరో జర్నలిస్టు ఆయన ట్వీట్ చేసిన పోస్టును ప్రింట్ తీసి చూపించారు. మన దగ్గర అయితే.. అధికారపక్ష అధినేత గొంతు పెంచగానే.. పాత్రికేయులు తగ్గుతారు. కానీ.. ఇందుకు భిన్నంగా పాక్ జర్నలిస్టులు వ్యవహరించటం మామూలు విషయం కాదు.

ఇలా తన ఆగ్రహాన్ని పట్టించుకోకుండా.. ప్రొఫెషన్ పట్ల తమకున్న కమిట్ మెంట్ చూపించిన సదరు జర్నలిస్టుల దెబ్బకు పాక్ విదేశాంగ మంత్రి షాక్ కు గురయ్యారు. అలా అని.. తాను దొరికిపోయినట్లు కాకుండా.. ఎమోషన్ ను తెర మీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నాకు ఆశ్చర్యంగా ఉంది.. మీరు ఎవరి తరఫున ఏ ఎజెండాతో పని చేస్తున్నారు? అంటూ వ్యాఖ్యానించినా.. జర్నలిస్టులు మాత్రం తగ్గకపోవటం చూసినప్పుడు.. సత్యం విషయంలో వారు ప్రదర్శించిన తెగువకు హేట్సాప్ చెప్పాలనిపించక మానదు.