Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన పాక్ జర్నలిస్టు

By:  Tupaki Desk   |   8 Aug 2022 5:04 AM GMT
ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన పాక్ జర్నలిస్టు
X
ప్రపంచంలోని ప్రతి దేశానికి దారి సరిహద్దు దేశాలు ఉండటం.. వాటితో వారికి ఉండే సంబంధాలకు సంబంధించి పలు అంశాలు ఉంటాయి. వీటికి భిన్నమైన రీతిలో భారత్ - పాక్ మధ్య సంబంధాలు ఉంటాయన్నది తెలిసిందే. పట్టుబట్టి మరీ.. భారత్ నుంచి విడిపోయి.. పాకిస్థాన్ పేరుతో వేరే దేశంగా మారినప్పటికి.. ప్రజాస్వామ్యం కంటే ఎక్కువగా సైనికులు.. సైనిక పాలనలోనే ఆ దేశ ప్రజలు మగ్గటం.. దీనికి తోడు ఆ దేశాన్ని ఏలిన పలువురు నియంతలు కావటంతో పాటు.. మత ప్రాతిపదికన ఏర్పడిన ఆ దేశం ఎలాంటి పంథాను అనుసరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ ను పొగిడేందుకు పాక్ జాతీయులు ఇష్టపడుతుంటారు. అది కూడా తప్పని పరిస్థితుల్లో మాత్రమే.

ఇదంతా ఎందుకంటే.. ప్రస్తుతం బ్రిటన్ లో జరుగుతున్న కామన్త్ వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. పలువురు క్రీడాకారులు స్వర్ణాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత (పూజ గహ్లోత్) ఒకరు స్వర్ణాన్ని మిస్ అయి కాంస్యంతో సరిపెట్టుకోవాల్సిన సందర్భంలో ఆమె ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు.

తాను అనుకున్నట్లుగా బంగారు పతకాన్ని సాధించలేకపోయినట్లుగా వేదన చెందటమే కాదు.. తనను దేశ ప్రజలు క్షమించాలని కోరిన వైనం భారత ప్రజల్ని కదిలించింది. ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రత్యేకంగా ట్వీట్ చేయటంతో పాటు.. ఆమె విజయాన్ని ప్రశంసించారు.

తాను సాధించిన విజయాల్ని తక్కువ చేసి చూసుకుంటున్న ఆమెను ఊరడిస్తూ.. స్ఫూర్తిని రగిలించే వ్యాఖ్యలు చేశారు. 'పూజా.. మీరు సాధించిన పతకంతో వేడుకలు చేసుకోవాలి. క్షమాపణలు చెప్పటం కాదు. మీ జీవిత ప్రయాణం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేయటంతో పాటు మాకెంతగానో స్ఫూర్తిని ఇస్తుంది. మీరు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారు. మీ ప్రతిభను ఇలానే కొనసాగించండి' అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్టు షిరాజ్ హసన్ స్పందించారు. భారత్ తమ క్రీడాకారుల్ని ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి. పాక్ ప్రధానమంత్రి.. అధ్యక్షుడి నుంచి మోడీ తరహాలో ప్రోత్సాహకర మాటలు ఎప్పుడైనా చూశామా? కనీసం పాక్ అథ్లెట్లు పతకాలు గెలుస్తున్నారే విషయమైనా తెలుసా?'' అంటూ ప్రశ్నలు సంధించారు.

మోడీ తీరును ప్రశంసిస్తూ.. తమ సొంత పాలకుల్ని ప్రశ్నించిన పాకిస్థాన్ జర్నలిస్టు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. స్వర్ణం మిస్ అయ్యిందన్న బాధతో ఉన్న పూజ గహ్లోత్ కు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆమెను పలువురు ఊరడిస్తున్నారు. మహిళల 50 కేజీల విభాగంలో ఆమె కాంస్యాన్ని సాధించటాన్ని తక్కువగా చూడొద్దంటూ దేశ ప్రధానే స్వయంగా వ్యాఖ్యానించటం.. ఇది వేడుక చేసుకోవాల్సిన సమయమని పేర్కొన్న వైనం అందరిని ఆకర్షిస్తోంది.