దాయాది దేశమైన పాకిస్థాన్ తీరు మారలేదు. మానవతా దృక్ఫథంతో కుల్‌భూషణ్ జాదవ్‌ను తన భార్య, తల్లితో కలిసి మాట్లాడేందుకు అనుమతించామని చెబుతూనే.. తన అబద్ధపు ప్రచారానికి మరింత పదును పెట్టింది. భారత ఉగ్రవాదానికి జాదవ్ ప్రతీక అంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన గూఢచర్యం చేసేందుకే పాకిస్థాన్‌లో అడుగుపెట్టారని, ఎన్నో విద్రోహ చర్యలకు పాల్పడ్డారని ఫైజల్ ఆరోపించారు.
పాక్‌లో జాదవ్‌తో తల్లి, భార్య మీటింగ్ తర్వాత ప్రత్యేకంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేసిన పాక్ విదేశాంగ శాఖ.. లేనిపోని ఆరోపణలకు దిగింది. తమ విచారణలో తాను తప్పు చేసినట్లు జాదవ్ అంగీకరించారని ఈ సందర్భంగా ఫైజల్ చెప్పారు. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) జాదవ్ వెనుక ఉందని, పాకిస్థాన్‌లో ఆయన పాల్పడిన ప్రతి విద్రోహ చర్యకు రా సాయం చేసిందని ఆరోపించారు. జాదవ్‌ను తాము అరెస్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ముస్లిం పేరుతో ఉన్న పాస్‌పోర్ట్ ఉందని, ఆ రెండో పాస్‌పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో భారత్ ఇప్పటివరకు చెప్పలేదని ఫైజల్ చెప్పారు. జాదవ్‌ను తల్లి, భార్యతో కలవడానికి అంగీకరించినంత మాత్రాన తాము ఈ కేసులో మెత్తబడినట్లు కాదని స్పష్టంచేశారు. రెండు దేశాలకు వారి వారి ప్రయోజనాలు ఉన్నందువల్ల ఈ విషయంలో ఎలాంటి చర్చలకు తావు లేదని చెప్పారు. భద్రతా కారణాల వల్లే తాము కుల్‌భూషణ్‌కు ఆయన కుటుంబ సభ్యులకు మధ్య ఓ గ్లాస్ డోర్ ఏర్పాటు చేశామని, ఈ విషయాన్ని తాము ముందుగానే భారత ప్రభుత్వంతో చెప్పామని ఆయన తెలిపారు.
కాగా, భారత గూఢచారిగా ముద్ర పడి పాక్ విధించిన మరణ శిక్షను ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాదవ్.. తన తల్లి, భార్యను కలిశారు. ఆయనను కలవడానికే ప్రత్యేకంగా ఇస్లామాబాద్ వెళ్లిన ఆ ఇద్దరూ.. పాక్ విదేశాంగ శాఖ కార్యాలయంలో జాదవ్‌తో మాట్లాడారు. వీరికి పాకిస్థాన్ 30 నిమిషాల సమయం కేటాయించింది. ఈ ఇద్దరితోపాటు పాక్ తరఫున విదేశాంగ కార్యాలయ డైరెక్టర్ ఫరేహా బుగ్టి కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసేందుకే జాదవ్‌ను ప్రత్యేకంగా విదేశాంగ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సమావేశానికి ముందు పాకిస్థాన్‌కు జాదవ్ కృతజ్ఞతలు చెప్పినట్లుగా ఉన్న ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తాను ఇరాన్ నుంచి బలూచిస్థాన్‌కు వచ్చి పట్టుబడినట్లు ఆయన చెప్పడం చూస్తే.. కచ్చితంగా జాదవ్‌ను బెదిరించి ఈ మాట చెప్పించినట్లు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.