Begin typing your search above and press return to search.

మనమ్మాయికి పాక్ డ్రైవర్ ఎంత సాయం చేశాడంటే?

By:  Tupaki Desk   |   14 Jan 2020 6:03 AM GMT
మనమ్మాయికి పాక్ డ్రైవర్ ఎంత సాయం చేశాడంటే?
X
దాయాది దేశంపై భారత ప్రభుత్వమే కాదు.. భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం చూస్తుంటాం. అయితే.. ఈ కోపం పాక్ ప్రభుత్వం మీదనే తప్పించి.. పాక్ ప్రజల మీదే కాదు. ఆ మాటకు వస్తే.. ఉగ్రవాదులు పాకిస్తాన్ లో చెలరేగిపోయి మారణహోమానికి పాల్పడుతుంటే ఏ భారతీయుడు సంతోష పడడు సరికదా.. వేదన చెందుతారు. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో అయ్యో అనుకోకుండా ఉండలేరు. దాయాది ప్రభుత్వాలు పాడు పనులు చేస్తాయే కానీ.. పాక్ ప్రజలకు అందులో భాగస్వామ్యం ఉందని ఏ ఒక్కరూ ఫీల్ కారు. అదే సమయంలో దాయాది దేశ ప్రజల మధ్య తెలీని భావోద్వేగం తరచూ బయటపడుతూ ఉంటుంది. తాజాగా దుబాయ్ లో ఒక పాకిస్తానీ కారు డ్రైవర్ చేసిన పని తెలిస్తే.. భారతీయులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. చివర్లో అతగాడు చేసిన వ్యాఖ్యకు ఫిదా కావాల్సిందే.

ఇంతకూ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన రాచెల్ రోజ్ కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. దుబాయ్ లో డిగ్రీ పూర్తి చేసిన రోజ్.. ప్రస్తుతం ఇంగ్లండ్ లోని లాంక్ స్టర్ వర్సిటీలో న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవవల దుబాయ్ వచ్చిన ఆమె.. తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు. ఈ నెల నాలుగున బుర్జుమాన్ దగ్గర్లో సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో తన స్నేహితురాలితో కలిసి పాక్ కు చెందిన ఖాదీమ్ టాక్సీ ఎక్కారు.

అదే సమయంలో మరో కారులో వారి ఫ్రెండ్స్ ఉండటాన్ని గమనించి కారులో నుంచి బయటకు దిగిపోయారు. స్నేహితులకు వద్దకు వెళ్లే తొందరలో తన వ్యాలెట్ ను కారులోనే వదిలేశారు. కట్ చేస్తే.. ఆమె ఎక్కి దిగిపోయిన తర్వాత రెండు ట్రిప్పులు వేసిన పాక్ డ్రైవర్.. చివర్లో కారులో ఉన్న వ్యాలెట్ ను గుర్తించాడు.అందులో కనిపించిన వీసాతో పాటు.. ఇతర కార్డులతో తన కారులో ఎక్కి దిగిపోయిన మహిళ అన్న విషయం అర్థమై.. ఆమె బ్యాగ్ తిరిగి అప్పగించేందుకు రవాణా శాఖ అధికారులను సంప్రదించాడు.

రోజు మర్చిపోయిన బ్యాగ్ లో ఎమిరేట్స్ ఐడీ.. యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్.. బీమా కార్డు.. క్రెడిట్ కార్డుతో పాటు వెయ్యి దిర్హామ్ లు ఉన్నాయి. అదే సమయంలో తన బ్యాగ్ ను మర్చిపోయిన విషయాన్ని రోజ్ గుర్తించారు. తన బ్యాగ్ కోసం ఆమె పోలీసుల్ని సంప్రదించారు. కారు ఎక్కిన ఆమె.. ట్రిప్ స్టార్ట్ కాకముందే దిగిపోవటంతో డ్రైవర్ ను గుర్తించటం కష్టమని పేర్కొన్నారు. మరోవైపు రోజ్ అడ్రస్ ను వెతికేందుకు సదరు పాక్ డ్రైవర్ పలు ప్రయత్నాలు చేశారు. చివరకు రవాణా శాఖ అధికారుల నుంచి ఫోన్ రావటమే కాదు.. రోజ్ అడ్రస్ ను చెప్పారు.

దీంతో.. ఆమె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన పాకిస్తాన్ డ్రైవర్.. ఎట్టకేలకు వారింటికి చేరుకున్నారు. మర్చిపోయిన బ్యాగును వారి కుటుంబానికి అందజేశారు. జరిగిన దాని గురించి తెలుసుకొన్న రోజ్ తండ్రి డ్రైవర్ ఖాదిమ్ చేసిన పనికి విపరీతంగా సంతోషించారు. ఖదిమ్ చేసిన పనికి 600 దిర్హామ్ లు ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతడు ఆ మొత్తాన్ని తీసుకునేందుకు తిరస్కరించటమే కాదు.. రోజ్ తన సోదరి లాంటిదని చెప్పి తన ఇంటికి బయలుదేరారు. బ్యాగ్ ను అప్పజెప్పటం కోసం తెల్లవారుజామున మూడున్నర గంటల వరకూ శ్రమించిన ఖదీమ్ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. పాక్ డ్రైవర్ పెద్ద మనసుకు ఫిదా అవుతున్నారు.