Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్ లో పాకిస్థాన్ vs భారత్ : మరికాసేపట్లో భారీ ఫైట్ , విజయం ఎవరిదో !

By:  Tupaki Desk   |   7 Aug 2021 10:30 AM GMT
ఒలంపిక్స్ లో పాకిస్థాన్ vs భారత్ : మరికాసేపట్లో భారీ ఫైట్ , విజయం ఎవరిదో !
X
టోక్యో ఒలింపిక్స్ లో 16 వ రోజు భారత్ ఆటగాళ్లకు మూడు పతకాలు వస్తాయని భావించిన సమయంలో గోల్ఫర్ అదితి చివరి నిమిషంలో తడబడి నాలుగో స్థానానికి పరిమితమయ్యింది. భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది అనుకుంటున్న ఈవెంట్ జావెలిన్ థ్రో, ఇప్పటి వరకూ ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్, పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌ కు భారత్ అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్‌ లో భారత్‌ కు ప్రాతినిథ్యాన్ని వహించిన నీరజ్ చోప్రా సాయంత్రం 4. 30 నిమిషాలకు ఫైనల్స్ ఆడనున్నాడు.

నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్స్ రౌండ్‌ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా, ఒత్తిడికి అందకుండా, బరిలోకి దిగాడు దుమ్ము దులిపాడు. తొలి ప్రయత్నంలోనే అతను ఏకంగా 86.65 మీటర్ల దూరం వరకు జావెలిన్‌ ను సంధించాడు. ఈ విభాగంలో పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు. ఇదీ రికార్డే. ఫస్ట్ అటెంప్ట్‌ లోనే నీరజ్ రికార్డ్ స్థాయి దూరానికి జావెలిన్‌ ను సంధించాడు. గ్రూప్-ఏ విభాగంలో అతనే టాపర్. భారత్‌ ను తొలి స్థానంలో నిలిపాడు నీరజ్ చోప్రా. ఈ కేటగిరీలో భారత్ అగ్రస్థానంలో నిలవగా, జర్మనీ, ఫిన్లాండ్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి.

అయితే పురుషుల జావెలిన్ థ్రో విభాగం గ్రూప్-ఏ లో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవగా.. గ్రూప్-బీలో పాకిస్తాన్ ప్లేయర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. పాకిస్తాన్ జావెలిన్ థ్రయోర్ అర్షద్ నదీం.. గ్రూప్-బీలో మొదటి స్థానంలో ఉన్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌ లో అర్షద్ 85.16 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ ను విసిరాడు. దీంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్వాలిఫికేషన్స్ రౌండ్‌ లో నీరజ్, అర్షద్ లు వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల తారసపడలేదు. ఫైనల్స్‌ లో మాత్రం పరిస్థితి అలా ఉండదు. క్వాలి ఫై అయిన థ్రయోర్లందరూ ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచ కప్ లో ఏ విధంగా పాకిస్తాన్ ను భారత్ ఓడిస్తుందో, అదే విధంగా ఇప్పుడు నీరజ్ అర్షద్ ను ఓడించి పతకం సాధించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు అథ్లెటిక్స్‌ లో భారత క్రీడాకారులు పేలవమైన ప్రదర్శనే చేశారు. తజిందర్ పాల్ సింగ్, శివ్‌ పాల్, కమల్‌ ప్రీత్ కౌర్, ద్యుతీచంద్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఒక్క పతకం కూడా లభించలేదు. కానీ నీరజ్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌ కు చేరడంతో పతకం ఆశలు మళ్లీ చిగురించాయి. అర్హత పోటీల్లో చేసిన ప్రతిభను పునరావృతం చేస్తే నీరజ్ ఖాతాలో ఒలింపిక్ పతకం చేరడం ఖాయం. ఇక నీరజ్ మురిపిస్తాడా సహచర అథ్లెట్లలాగా నిరాశ పరుస్తాడా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.