Begin typing your search above and press return to search.

భారత్ దాడి.. మా పర్యావరణం దెబ్బతింది

By:  Tupaki Desk   |   2 March 2019 5:09 AM GMT
భారత్ దాడి.. మా పర్యావరణం దెబ్బతింది
X
పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ భారత్ వాయుసేన ఉగ్రవాదులను హతమార్చింది. కరుడుగట్టిన తీవ్ర వాదులను, ఆ శిబిరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సైనికులతో యుద్ధం చేసి వారిని హతమార్చింది. అయితే ఇంత ప్రాణనష్టం జరిగినా.. పాకిస్తాన్ వారి ప్రాణాలను లెక్కలోకి తీసుకోకుండా సిల్లీ కారణంతో ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. ఉగ్రవాదులు - సైనికుల మరణాలను పక్కనపెట్టి భారత్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయని.. మా పర్యావరణం దెబ్బతిందని ఫిర్యాదు చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

జమ్మూలోని పూల్వామా దాడి తరువాత భారత్‌ ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో గత నెల 26న పాక్‌ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులను చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇందులో ఉగ్రవాదులతో పాటు శిక్షణ పొందుతున్నవారు ఉన్నారు. అయితే తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని చెబుతున్న పాక్‌.. అవకాశం దొరికితే చాలు భారత్ పై ఆరోపణల దాడి చేస్తోంది.

తాజాగా కొత్త నినాదంతో పాక్‌ వార్తల్లో నిలిచింది. భారత్‌ వైమానిక దాడుల వల్ల తమ ప్రాంతంతో చెట్లు నాశనమయ్యాయని ఆరోపిస్తోంది. భారత్‌ వాయుసేన విమాన దాడులతో పాక్‌ భూభాగంలోని పర్యావరణం దెబ్బతిందని - దీంతో మాకు తీవ్ర నష్టం జరిగిందని ఆ దేశానికి చెందిన మంత్రి మాలిక్‌ అమిన్‌ అస్లాం వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు.

ఈ దాడుల వల్ల తమ భూభాగంలోని ఫైన్‌ చెట్లు కూలిపోయాయని, దీంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. వీటిని పరిశీలించేందుకు అంతర్జాతీయ మీడియాను పాక్‌ ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఇద్దరు జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. మొత్తం 15 ఫైన్‌ చెట్లు కూలిపోయినట్లు గుర్తించారు. వైమానిక దాడులతో ఇవి కూలాయని పాక్‌ మంత్రి వారికి చెప్పారు.

నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌ భారత్‌ వేసే బాంబు దాడులతో తీవ్ర నష్టం జరుగుతోందని చెబుతోంది. బాంబులు జారవిడవడంతో తమ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నదని చెబుతోంది. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవచ్చని పాక్‌ మంత్రి చెబుతున్నారు.