Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్...

By:  Tupaki Desk   |   7 Nov 2016 1:05 PM GMT
పాకిస్థాన్ నకిలీ సర్జికల్ స్ట్రైక్స్...
X
శత్రుమూకలను ఛిద్రం చేయడంలో సైనిక పాటవానికి సంబంధించి గొప్పగా చెప్పుకునే విషయం... "సర్జికల్ స్ట్రైక్స్". ఈ స్ట్రైక్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టిన పాకిస్థాన్ ఈ పేరుమీద పనికిమాలిన పనులకు ఒడిగట్టింది. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఈ దాడులు చేస్తే... భారత్ లోని సాధారణ ప్రజానీకంపై పాక్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. ఇప్పటికే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల నియంత్రణ ఒప్పందానికి నిత్యం తూట్లు పొడుస్తూ భారత సరిహద్దు భద్రతా దళాలపై వరుసగా కాల్పులు జరుపుతున్న పాక్ తాజాగా సరిహద్దు గ్రామాలపైనా పాశవిక దాడులకు తెగబడుతుంది.

తాజాగా జమ్ముకశ్మీర్ లోని మెంధార్ సెక్టార్ లో పాక్ రేంజర్లు 120 ఎంఎం - 82 ఎంఎం మోర్టార్లతో భీకర కాల్పులకు తెగబడ్డారు. ఇలా పాక్ జరిపిన దాడుల్లో సుమారు 20మందికి పైగా భారత పౌరులు - జవాన్లు మరణించారు. ఈ సమయంలో ఉగ్రవాదులతో కలిపి పాక్ సైన్యం భారతజవాన్లు, ప్రజలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీరిని అణిచివేసే క్రమంలో చాలా చోట్ల భారత బలగాలు పైచేయి సాధించినా... మరికొన్ని చోట్ల మాత్రం చేదు అనుభవాలు తప్పడంలేదనే చెప్పాలి.

కాగా ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల పై సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్ దూకుడును ప్రపంచదేశాలన్నీ సమర్థించగా - చెంపపై వాపు కనిపిస్తున్నా కూడా అలాంటిదేమీ జరగలేదని పాక్ తేలుకుట్టిన దొంగలా గమ్మునుంది. అనంతరం పాక్ చేయబోయే పనుల విషయంలో ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్ - గుజరాత్ సరిహద్దుల్లోని గ్రామాలను ఖాళీ చేయించారు. అయితే ఈ విషయంలో సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను దాదాపు ఖాళీచేయించిన భారత సైన్యం... కశ్మీర్ లో మాత్రం ఆపని చేయలేదు. దీంతో పాక్ రేంజర్లు - పాక్ అప్రకటిత సన్యమైన ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్ అని పేరుచెప్పుకుని ఆ గ్రామాలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కశ్మీర్ లోని సరిహద్దు గ్రామస్తులను కూడా వీలైనంత త్వరగా తరలించాలని, ఈ మేరకు కేంద్రం వెంటనే నిర్ణయం టీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/