Begin typing your search above and press return to search.

లాడెన్ మా హీరో అన్న మాజీ దేశాధ్యక్షుడు

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:34 AM GMT
లాడెన్ మా హీరో అన్న మాజీ దేశాధ్యక్షుడు
X
దాయాది దేశమైన పాకిస్థాన్ అసలు రంగు ​మరోసారి బయటకు వచ్చింది. నిత్యం శ్రీరంగనీతులు చెప్పే ఆ దేశం అసలు రంగును ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బయటపెట్టారు. ప్రపంచాన్ని వణికించిన తీవ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ తమ దేశంలోనే ఉందన్న వ్యాఖ్యను ముషారఫ్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదు పామును పాలు పోసి.. పెంచి పోషించింది తమ దేశమేనన్న అసలు నిజాన్ని ముషారఫ్ బయటపెట్టారు.

తాజాగా నోరు విప్పిన ముషారఫ్ పాక్ మరో కోణాన్ని బయటపెట్టారు. భారత్ లో తీవ్రవాదానికి పాక్ కారణమని చెప్పుకొచ్చారు ముషారఫ్. 1990లలో కశ్మీర్ తిరుగుబాటు ఉద్యమం ప్రారంభమైన సమయంలో తాము పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కశ్మీర్ లో వేర్పాటువాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాకే లష్కరే తోయిబా సహా 12 ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయని.. వాటికి పాక్ మద్ధతు ఇవ్వటమే కాదు..శిక్షణ కూడా ఇచ్చిందన్నారు. తాలిబన్లకు శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పంపామని కూడా చెప్పారు.

ప్రపంచాన్ని వణికించిన తీవ్రవాదులు ఒసామా బిన్ లాడెన్.. జవహరి.. తాలిబన్ల వంటి వారిని పాక్ హీరోలుగా భావించేదన్నారు. పాక్ లోని మతతత్వ పోరాటం ఇప్పుడు ఉగ్రవాదంగా మారిందని చెప్పిన ముషారఫ్.. ‘‘ ఇప్పుడు వారు సొంత ప్రజలనే చంపుతున్నారు. దీన్ని తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉంది’’ అని వాపోయారు. ఒకప్పుడు హీరోలుగా చెలామణి అయిన లాడెన్.. జవహరి లాంటి వాళ్లు తర్వాత విలన్లుగా మారారని.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. పాక్ కపటత్వాన్ని.. ఉగ్రవాద సంస్థల్ని పెంచిన విషయాన్ని మజీ దేశాధ్యక్షుడి హోదాలో ముషారఫ్ పూస గుచ్చినట్లు చెప్పటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.