Begin typing your search above and press return to search.

అతి త్వరలో తాలిబన్ ప్రభుత్వం..కూర్పుపై కసరత్తు, పాక్ ప్రకటన

By:  Tupaki Desk   |   31 Aug 2021 2:00 AM GMT
అతి త్వరలో తాలిబన్ ప్రభుత్వం..కూర్పుపై కసరత్తు, పాక్ ప్రకటన
X
ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా సహా పాశ్చాత్య దేశాల బలగాలు పూర్తిగా వెళ్లిపోవడం తో తాలిబన్లకు ఈ రోజు పూర్తిస్ధాయిలో స్వాతంత్రం లభించినట్లయింది. దీంతో ఇక ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాము విధించిన ఆగస్టు 31 డెడ్ లైన్ తర్వాత కూడా అమెరికా బలగాలు ఉంటాయన్న అనుమానంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న తాలిబన్లు అమెరికా ముందు అనుకున్న సమయం కంటే ఒకరోజు ముందే పూర్తిగా అన్ని సర్దుకొని వెళ్లిపోవడంతో స్పీడ్ పెంచనున్నారు.

మరికొన్ని రోజుల్లోనే కొత్త ఆప్ఘనిస్తాన్ సర్కారు తాలిబన్ల నేతృత్వంలో ఏర్పాటు కాబోతోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ఇవాళ ప్రకటించారు. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. కొంతకాలంగా ఆప్గనిస్తాన్ లోనే పాగా వేసి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ప్రతినిధిగా తాలిబన్లతో చర్చలు జరుపుతున్న ఆయన.. కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలనే అంశంపై పలు సూచనలు చేస్తున్నారు.

తాలిబన్లతో పాటు హక్కానీ నెట్ వర్క్ కు చెందిన కీలక నేత సిరాజుద్దీన్ హక్కానీకి కూడా తాలిబన్ల టీమ్ లో చోటు కల్పించాలని ఆయన సూచించినట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు తరలివెళ్లిన నేపథ్యంలో అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్దమవుతుండగా, మరోవైపు పంజ్ షీర్ లోయలో తిరుగుబాటు దారులతో జరుగుతున్న పోరులో 8 మంది తాలిబన్లు చనిపోయినట్లు తెలుస్తోంది.

దీంతో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు అర్ధమవుతోంది. అటు ఆప్గన్ లో తాజా పరిస్దితుల నేపథ్యంలో తమ ఎంబసీని ఖతార్ కు తరలిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. ఇప్పటికే తమ ఎంబసీని కాబూల్ నుంచి టర్కీకి తాత్కాలికంగా తరలించిన జపాన్, ఇప్పుడు తాలిబన్ల మరో అడ్డా అయిన ఖతార్ కు తరలిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఆప్ఘన్ రాజధానిలోని కాబూల్ ఎయిర్ పోర్ట్ నిర్వహణపై తాలిబన్లు తమ మిత్రదేశాలైన ఖతార్, టర్కీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారాల్లో అంతగా అనుభవం లేని తాలిబన్లకు ఆయా దేశాలు సాయం చేయబోతున్నాయి.