Begin typing your search above and press return to search.

మోదీ దెబ్బ‌కు పాక్‌ బెంబేలు!

By:  Tupaki Desk   |   27 Sep 2016 3:30 PM GMT
మోదీ దెబ్బ‌కు పాక్‌ బెంబేలు!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దెబ్బ‌కు పాకిస్థాన్ నిజంగానే బెంబేలెత్తిపోతోంది. ఉరీ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్ యుద్ధ స‌న్నాహాలు చేస్తోంద‌న్న విష‌యం తెలిసిన వేళ‌... అంత‌గా కంగారు ప‌డ‌ని పాక్‌ - సింధు న‌దీ జ‌లాల విష‌యంలో మోదీ నిర్వ‌హించిన స‌మీక్ష‌తో మాత్రం ఆ దేశ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌నే చెప్పాలి. సింధు న‌దీ జ‌లాలే పాక్ కు జీవ‌నాధారంగా మారిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు న‌దీ జ‌లాల‌కు సంబంధించి ఇరు దేశాల మ‌ధ్య చాలా కాలం క్రితం కుదిరిన ఒప్పందాన్ని పునఃప‌రిశీలిస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే ర‌ద్దు చేసుకుంటామంటూ మోదీ డేంజ‌ర్ బెల్స్ మోగించారు. వాస్త‌వానికి సింధు న‌దీ జ‌లాల్లో త‌న‌కు ద‌క్కిన వాటాను భార‌త్ పూర్తి స్థాయిలో వినియోగించుకున్న దాఖ‌లా లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కు ద‌క్కిన వాటాతో పాటు భార‌త్ వ‌దిలేసిన నీటిని కూడా పాక్ వాడుకుంటోంది. అయితే సింధు న‌దిలో త‌క్కువ నీరున్న స‌మ‌యంలో త‌న వాటా త‌న‌కు ద‌క్క‌లేద‌ని వాపోతున్న పాక్‌... ఆ న‌దిలో స్థాయికి మించి ప్ర‌వాహం వ‌చ్చిన స‌మ‌యంలో మాత్రం వ‌ర‌ద ముప్పు పొంచి ఉంద‌ని భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

పాక్ వాద‌న‌తో ఏమాత్రం సంబంధం లేకుండా... స‌ద‌రు న‌దీ జ‌లాల‌కు సంబంధించిన ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవ‌డానికి కూడా వెనుకాడ‌బోమ‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పాక్ లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కు విదేశీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి స‌ల‌హాదారుగా ప‌నిచేస్తున్న స‌ర్తాజ్ అజీజ్ స్పందించారు. సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ ర‌ద్దు చేసుకుంటే తాము చూస్తూ ఊరుకునేది లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒప్పందం ర‌ద్దుకు మోదీ మొగ్గితే... తాము అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాకుండా భార‌త్ తీసుకునే నిర్ణ‌యం ఏక‌ప‌క్ష‌మ‌ని అంత‌ర్జాతీయ స‌మాజానికి తెలియ‌జేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

ఇదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజంలో కాస్తంత మంచి పేరు తెచ్చుకునే ప‌నిని ఇప్ప‌టికే ప్రారంభించిన పాక్‌... నేడు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హిందూ మైనారిటీల‌కు వివాహ న‌మోదు హ‌క్కు క‌ల్పించే కీల‌క బిల్లు ఆ దేశ పార్ల‌మెంటులోని దిగువ స‌భ ఆమోద ముద్ర వేసింది. ప‌ది నెల‌ల పాటు ఆమోదానికి నోచుకోని సద‌రు బిల్లుకు... మోదీ కీల‌క నిర్ణ‌యంతో సింగిల్ డేలోనే గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించడం గ‌మ‌నార్హం. ఈ ఒక్క చ‌ర్య‌తోనే పాక్ ఎంత‌మేర బెంబేలెత్తుతుందో తేలిపోయింది. పాక్ జ‌నాభాలో 1.6 శాతంగా ఉన్న హిందువుల‌కు ఇప్ప‌టిదాకా వివాహ‌న న‌మోదు హ‌క్కు లేదు. దీనిని ఆస‌రా చేసుకుంటున్న పాకిస్థానీలు హిందూ మ‌హిళ‌ల‌పై య‌ధేచ్ఛ‌గా అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఈ బిల్లుకు ఆమోదం ల‌భించడంతో ఈ దారుణాల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ బిల్లు ప్ర‌కారం పాక్ లోని మైనారిటీ హిందూ యువ‌తుల వివాహ వ‌య‌స్సు 18గా నిర్ధార‌ణ అయ్యింది. అదే పాక్ లోని మెజారిటీ ముస్లిం యువ‌తుల వివాహ వ‌య‌సు మాత్రం 16 ఏళ్లే.