Begin typing your search above and press return to search.

బతిమిలాడారు.. ఇప్పుడు బెదిరిస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Sep 2015 3:38 PM GMT
బతిమిలాడారు.. ఇప్పుడు బెదిరిస్తున్నారు
X
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి కక్కాలేక.. మింగాలేని పరిస్థితి. భారత్ తో సిరీస్ కోసం గంపెడాశలు పెట్టుకుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ భారత్ సిరీస్ తో మటుమాయం అవుతాయని భావించింది. అయితే.. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరీస్ విషయంలో కేంద్రాన్ని అనుమతి కోరేందుకు సైతం ఇష్టపడటం లేదు. భారత క్రికెట్ బోర్డు నుంచి చడీ చప్పుడు లేకపోవటంతో.. సరిహద్దుల మధ్యనున్న ఉద్రిక్తతలకు.. ఆటకు సంబంధం లేదని.. దేని దారి దానిదే అంటూ పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ గతంలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

తొలుత.. భారత్ సిరీస్ గురించి బతిమిలాడిన ధోరణితో పాక్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తే.. బీసీసీఐ నుంచి స్పందన లేకపోవటంతో ఇప్పుడు బెదిరింపులకు దిగుతోంది. షెడ్యూల్ ప్రకారం రెండు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కానీ జరగకుంటే.. భవిష్యత్తులో టీమిండియాలో క్రికెట్ మ్యాచ్ లు ఆడమంటూ సరికొత్త మెలిక పెడుతున్నారు. తమతో సిరీస్ రద్దు చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో తాము టీమిండియాతో మ్యాచ్ లు ఆడమని హెచ్చరిస్తున్నారు. బతిమిలాడటం పోయి.. బెదిరించే స్థితికి దిగజారిన పాక్ క్రికెట్ బోర్డు రానున్న రోజుల్లో మరెన్ని లీలలు ప్రదర్శిస్తుందో..?