Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ మనసు దోచిన ధోని-యువీ- కోహ్లి

By:  Tupaki Desk   |   21 Jun 2017 12:36 PM IST
పాకిస్థాన్ మనసు దోచిన ధోని-యువీ- కోహ్లి
X
పాకిస్థాన్ పేరెత్తితే భారతీయులకు మండిపోతున్న రోజులివి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ.. ఇండియాను గత కొంత కాలంగా కవ్విస్తూనే ఉంది పాకిస్థాన్. గత ఏడాది కాలంలో అనేకమంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు పాకిస్థానీయులు.. ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా.. మన భారత స్టార్ క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో సఖ్యతగా మెలగడం.. వారి పిల్లల్ని ముద్దు చేయడం చర్చనీయాంశమైంది. దేశాల మధ్య వైరం ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల మధ్య అలాంటిదేమీ ఉండదని చాటి చెబుతూ ఇరు దేశాలకు చక్కటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు భారత క్రికెటర్లు.

మొన్న భారత్-పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు రెండు దేశాల అభిమానులు పరస్పరం కత్తులు దూసుకుంటున్న సమయంలో ధోని.. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ముద్దుల కొడుకుని ఎత్తుకుని ఫొటోలకు పోజిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టు ఓపెనర్ అజహర్ అలీ కొడుకులిద్దరూ.. తమతో ఫొటోలు దిగాలని ఆశపడగా.. వాళ్ల కోరికను ధోని.. యువరాజ్.. కోహ్లి నెరవేర్చారు. దీనిపై అజహర్ అలీ చాలా సంతోషించాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని.. యువరాజ్.. కోహ్లి లెజెండ్స్ అని.. వాళ్లతో ఫొటోలు దిగినందుకు తన కొడుకు చాలా సంతోషంగా ఉన్నారని.. వారికి తన ధన్యవాదాలని ట్వీట్ చేస్తూ ఈ ఫొటోలు షేర్ చేశాడు అజహర్. ఈ ట్వీట్ పై చాలామంది స్పందించారు. భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తూ.. ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/