Begin typing your search above and press return to search.

పాక్ హిందువులు పండగ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   11 March 2017 5:58 AM GMT
పాక్ హిందువులు పండగ చేసుకుంటున్నారు
X
పొరుగు దేశ‌మైన పాకిస్తాన్‌ లో ఉన్న హిందువులు పండుగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌ చట్టసభల్లో చాలాకాలంగా పెండింగ్‌ లో ఉన్న హిందూ వివాహ చట్టానికి ఎట్టకేలకు ఆమోదం లభించడ‌మే ఇందుకు కార‌ణం. హిందూ వివాహ బిల్లు-2017ను పాక్‌ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాకిస్తాన్‌లోని హిందువులకు వివాహం అంశంలో వైయక్తిక చట్టాలు అమలు అవ‌తాయి. పెళ్లికి ముందు వధూవరులు సంతకం చేసిన షాదీ పత్రంపై పండిట్‌(పూజారి) సంతకం చేయాలి. ఆ తర్వాత సంబంధిత ప్రభుత్వ విభాగంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చెయ్యాలి. దీంతో వివాహానికి చట్టబద్ధత వస్తుంది. తద్వారా మహిళలు లబ్ధి పొందనున్నట్లు పాక్‌ ప్రభుత్వం తెలిపింది.

ఈ చట్టం పంజాబ్‌ - బెలూచిస్తాన్‌ - ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ల్లోనే అమలౌతుంది. నిజానికి ఈ బిల్లు గతేడాది సెప్టెంబరులోనే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో బిల్లులోని అంశాలను సెనేట్‌ మార్చడంతో మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంత‌రం చ‌ర్చ‌లు జ‌రిపి ఆమోదం పొందింది. కాగా, తాజా చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం హిందువుల కనీస వివాహ వయస్సును 18ఏళ్లుగా నిర్ణయించింది. మిగతా మతాలకు చెందిన వారిలో పురుషులు వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18కాగా మహిళలకు పదహారు సంవత్సరాలు. వివాహ వయసు విషయంలో కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై 5వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది.

వివాహాలను రిజిస్టర్ చేసుకోవడం వల్ల హిందూ మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని, ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో హక్కులూ లభిస్తాయని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జోహ్రా యూసఫ్ తెలిపారు. వివాహాల రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల భర్త పోయిన వితంతువులకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తమకు వివాహమైందని రుజువు చేసే ఆధారాలేవీ వీరి వద్ద లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కొత్త చట్టం వల్ల.. భర్త పోయిన ఆర్నెల్ల తర్వాత వితంతువులకు చట్ట పరంగా పనర్వివాహం చేసుకునే అవకాశం ఉంటుందని జోహ్రా తెలిపారు. విడాకులు ఇచ్చే హక్కును కూడా ఈ చట్టం హిందువులకు కల్పిస్తోందని ముఖ్యంగా.. భర్త నిర్లక్ష్యం చేయడం - రెండో పెళ్లి చేసుకోవడం లేదా పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే తనకు వివాహం జరిగిందన్న కారణాలపై హిందూ మహిళలు విడాకులు ఇచ్చేందుకు దీనివల్ల అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడుల నిరోధానికి సంబంధించి హిందువులకు మరింతగా రక్షణ కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/