Begin typing your search above and press return to search.

పాక్ 'అణు' పన్నాగం.. భారీ కుట్ర వెలుగులోకి..

By:  Tupaki Desk   |   25 Sep 2019 5:22 AM GMT
పాక్ అణు పన్నాగం.. భారీ కుట్ర వెలుగులోకి..
X
కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి విలీనం చేసిన భారత్ చర్యను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఇటీవల అమెరికాతో భారత్ స్నేహం కూడా పాకిస్తాన్ కడుపు రగిలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కశ్మీర్ విషయంలో భారత్ కు మద్దతు పెరగడం.. అమెరికా అండదండలతో ఏమీ చేయలేకపోతున్న పాకిస్తాన్ యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్నట్టు తెలిసింది.భారత్ తో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి వీలుగా పెద్ద ఎత్తున అణ్వాయుధ తయారీ కేంద్రాన్ని విస్తరిస్తోందని తేలింది.. ప్రముఖ న్యూస్ చానెల్ ఇండియాటుడే పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీని భారీగా పెంచుకుంటోందని ప్రసారం చేసిన కథనం ఇప్పుడు భారత్ లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

జమ్మూకశ్మీర్ ప్రజలను అణిచివేస్తున్న భారత్ ప్రభుత్వం వెంటనే ఆ చర్యలను విరమించుకోలేకపోతే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల హెచ్చరించారు. దీంతో ఆయన ప్రోద్బలంతోనే పాకిస్తాన్ లోని రావల్పిండిలో గల కహుటా అణ్వాయుధాల తయారీ కేంద్రంలో భారీగా అణ్వాయుధాల తయారీకి పూనుకుందని.. యురేనియం సేకరించి శుద్ధి చేస్తోందని ఇండియా టుడే సంచలన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం కహుటా అణ్వాయుధాల కేంద్రాన్ని భారీగా విస్తరిస్తున్నట్టు తెలిపింది. అణ్వాయుధాల కర్మాగారం విస్తరణకు సంబంధించిన కొన్ని కీలక ఫొటోలను ఇండియా టుడే ప్రసారం చేయడంతో పాకిస్తాన్ పన్నాగం బయటపడింది.

ఇక పాకిస్తాన్ అణ్వాయుధ తయారీ కేంద్రాన్ని చైనా సహాయంతోనే విస్తరిస్తోందని అంతర్జాతీయ అణుశక్తి అసోసియేషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు భారత్ కు ఆందోళన కలిగించేవని భారత వాయుసేన మాజీ దళాధికారులు హెచ్చరిస్తున్నారు. భారత్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే డేంజర్ అంటున్నారు. భారత్ లో ఉన్న అణ్వాయుధాల కంటే కూడా పాకిస్తాన్ ఎక్కువగా తయారుచేసుకుంటోందని చెబుతున్నారు. యుద్ధం వస్తే భారత్ కు తీవ్రనష్టం చేకూర్చడమే పాక్ ధ్యేయంగా ముందుకెళుతోందని ఇండియా టుడే సంచలన కథనంలో పేర్కొంది.