భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఏ ఫార్మాట్ లో మ్యాచ్ అయినా తీవ్ర ఆసక్తి రేపుతుందన్న సంగతి తెలిసిందే. దాయాది జట్ల మధ్య జరిగే ఉత్కంఠ పోరులో గెలుపునకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయి. అదే తరహాలో ఈ ఏడాది జూన్ 18న భారత్ - పాక్ ల మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో భారత్ పై పాక్ గెలుపొందింది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 180 పరుగుల తేడాతో భారత్ మీద పాక్ విజయం సాధించి అప్పటివరకు ఐసీసీ ఈవెంట్లలో భారత్ పై పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో, ఆ మ్యాచ్ అనంతరం పాక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ చిరస్మరణీయ విజయానికి గుర్తుగా పాక్ ప్రభుత్వం ఓ తపాలా బిళ్లను విడుదల చేసింది. వాటి ఫొటోలను తమ ట్విట్టర్ ఖాతాలో పాక్ ప్రభుత్వం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐసీసీ టోర్నీలో భారత్ పై తొలి గెలుపునకు ప్రతీకగా పాకిస్థాన్ తపాలా సేవా సంస్థ పాక్ క్రికెట్ జట్టు పేరుతో తపాలా బిళ్లలు విడుదల చేసింది. రూ. 5 - రూ. 10 విలువగల తపాలా బిళ్లలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకదానిపై పాక్ జట్టు ఫొటో, మరో దానిపై ఛాంపియన్స్ ట్రోఫీ బొమ్మలను ముద్రించారు. ఈ తపాలా బిళ్లలకు సంబంధించిన ఫొటోలను పాకిస్థాన్ ప్రభుత్వం తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కేవలం ఒక్క ఐసీసీ టోర్నీలో గెలుపొందినందుకు పాక్ ప్రభుత్వం ఈ విధంగా చేసి తన అల్ప బుద్ధిని మరోసారి చాటుకుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక్క గెలుపునకే పాక్ ఈ విధంగా చేస్తే - ఎన్నో విజయాలు సాధించిన భారత్ ఏ విధంగా స్పందించాలని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా దాయాది దేశానికి అంత మిడిసిపాటు తగదని అభిప్రాయపడుతున్నారు.