Begin typing your search above and press return to search.

పాక్ లో మళ్లీ సైనిక తిరుగుబాటు?

By:  Tupaki Desk   |   8 Oct 2016 7:24 AM GMT
పాక్ లో మళ్లీ సైనిక తిరుగుబాటు?
X
పాకిస్థాన్ కు సైనిక తిరుగుబాట్లు కొత్తేమీ కాదు.. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన నేతలపై సైన్యాధ్యక్షులు తిరుగుబాటు చేసి అధికారం అందుకోవడమన్నది అక్కడ ఒకరకంగా ఆచారంగానే వస్తోంది. ముషారఫ్ తరువాత మళ్లీ అలాంటి సందర్భం రానప్పటికీ ప్రస్తుతం పాక్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తిరుగుబాటు గండం ఉందని తెలుస్తోంది. ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ - ఆ దేశ ఆర్మీకి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ఆ దేశానికే చెందిన ‘డాన్’ పత్రిక ప్రత్యేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది. పాక్ ప్రధాని షరీఫ్ - సైనికాధికారులు - ప్రజాప్రతినిధులు - ఐఎస్ ఐ చీఫ్ రిజ్వాన్ అఖ్తర్‌ ల మధ్య ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం ఒకటి జరిగిందని.. ఆ సమావేశంలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయని... సైన్యం షరీఫ్ మాటలను ఖాతరు చేయడంలేదని పేర్కొంది.

జమ్ము కశ్మీర్‌ లోని ఉరీ ఘటన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాక్ ఏకాకిగా మారిందని, జైషే మహ్మద్ - హక్కానీ నెట్‌ వర్క్‌ లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఐజాజ్ చౌదరి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో వాగ్వాదం మొదలైంది. మంత్రి వ్యాఖ్యలకు ఐఎస్ ఐ చీఫ్ కల్పించుకుని గట్టిగా వాదించారు. దీంతో పరిస్థితి ఒక దశలో అదుపు తప్పిందని.. ఆ సమయంలో షరీఫ్ జోక్యం చేసుకున్నా సైన్యం వెనక్కు తగ్గలేదని డాన్ రాసుకొచ్చింది.

కాగా అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తుండడంతో స్పందించిన ప్రధాని షరీఫ్ జిహాదీ గ్రూపులపై ఎంతో కొంత చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నా సైన్యం ససేమిరా అంటోందట. దీంతో షరీఫ్‌ కు - సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయని ‘డాన్’ పేర్కొంది. ఇది ఎక్కడికైనా దారి తీయొచ్చని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/