Begin typing your search above and press return to search.

మోడీపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

By:  Tupaki Desk   |   4 Oct 2017 4:52 AM GMT
మోడీపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి
X
ప్ర‌ధాని మోడీపై పాక్ మంత్రి ఒక‌రు నోరు పారేసుకున్నాడు. ఇటీవ‌ల కాలంలో అంత‌ర్జాతీయ స‌మాజంలో వ‌రుస‌గా పాక్ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం.. పాక్ తీరును భార‌త్ ఎండ‌గ‌డుతున్న తీరు పాక్ అధికార‌ప‌క్షంలో ఎంత అస‌హ‌నాన్ని నింపుతుందో తాజా ఆరోప‌ణ‌లే నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. ప్ర‌ధాని మోడీని ఒక తీవ్ర‌వాది అని.. దేశ ప్ర‌జ‌లు ఒక ఉగ్ర‌వాదిని త‌మ దేశ ప్ర‌ధానిగా ఎన్నుకున్నార‌న్నారు.

తాజాగా ఒక వార్తా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాక్ విదేశాంగ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ భార‌త్ పైనా.. ప్ర‌ధాని మోడీ పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త ప్ర‌ధాని మోడీ ఒక టెర్ర‌రిస్టు అని.. భార‌త ప్ర‌జ‌లు ఒక ఉగ్ర‌వాదిని దేశ ప్ర‌ధానిగా ఎన్నుకున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక ఉగ్ర‌వాద సంస్థ అని.. ఆర్ఎస్ఎస్ దానికి అనుబంధంగా ప‌ని చేసే సంస్థ‌గా అభ‌వ‌వ‌ర్ణించారు. గుజ‌రాత్ అల్ల‌ర్ల‌లో ముస్లింల ర‌క్తం క‌ళ్ల చూశార‌న్నారు.

భార‌త్ లో గోవ‌ధ పేరుతో ముస్లింల‌ను.. ద‌ళితుల‌ను హ‌త‌మారుస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వ‌ల‌స వ‌చ్చిన ముస్లింల‌ను ఉగ్ర‌వాదుల‌తో పోల్చి వారి దిష్టిబొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెట్ట‌టం హేయ‌మైన చ‌ర్య‌గా వారు అభివ‌ర్ణించారు. ఇన్ని మాట‌లు చెబుతున్న పాక్ మంత్రికి త‌న దేశంలో ఉగ్ర‌వాదుల చ‌ర్య‌ల కార‌ణంగా అమాయ‌క‌మైన ప్ర‌జ‌లు హ‌త‌మార‌టం ఏమిట‌న్న దానికి ఏం స‌మాధానం చెబుతారు? గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు మతం రంగు పూస్తూ.. రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్న ఆయ‌న‌.. త‌న దేశంలోని ముస్లింల‌ను ముస్లిం ఉగ్ర‌వాదులు నిర్ద‌య‌గా చంపేయ‌టంపై ఏమ‌ని స‌మ‌ర్ధించుకుంటారు? పాక్ చేస్తున్న పాడుప‌నుల‌ను ప్ర‌పంచానికి తెలిసేలా చేస్తున్న మోడీ స‌ర్కారుపై పాక్ విదేశాంగ మంత్రికి ఆ మాత్రం అక్క‌సు ఉండ‌టంలో త‌ప్పు లేద‌ని చెప్పాలి.