Begin typing your search above and press return to search.

ఫేక్ ఇమేజ్‌ తో పాక్ డ్యామేజ్

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:12 AM GMT
ఫేక్ ఇమేజ్‌ తో పాక్ డ్యామేజ్
X
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అడ్డంగా బుక్కయిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి తన పరువు, నిజాయితీ రెండూ పోగొట్టుకుంది. భారత్ అరాచాకలంటూ తప్పుడు ఫొటోలు చూపించి దొరికిపోయింది.

ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ఉగ్రవాద ధోరణిని ఎండగడుతూ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రసంగంతో ఆత్మరక్షణలో పడ్డ పాక్ అందుకు విరుగుడుగా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో కొన్ని ఫొటోలను చూపించింది. అయితే... ఆ ఫొటోలే పాక్ కొంప ముంచాయి. ఐరాసలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ ఈ ఫొటోలను ప్రదర్శించారు. కశ్మీర్‌ లో మానవహక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తోందంటూ ఒక మహిళ ముఖంపై పెల్లెట్ల గాయాలున్న ఫొటోను ప్రదర్శించారామె.

ఆ ఫొటో ప్రదర్శించడంతో అన్ని దేశాల ప్రతినిధులు నిజమేనని నమ్మారు. దీంతో భారత్ దీనిపై ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. లోధి సమితిలో చూపించిన ఫొటో అసలు భారత్‌ లోది కాదని తేలింది. 2014లో గాజా అ‍ల్లర్లలో గాయపడ్డ రవా అబూ జామ్‌ అనే మహిళదిగా తేలింది.

దీంతో పాక్ చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత ప్రతినిధులు సాక్ష్యాలతో సహా వివరించారు. దీంతో ఐక్యరాజ్యసమతినే పాక్ తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నాన్ని అంతా ఖండించారు.