Begin typing your search above and press return to search.

మన జెండాతో దాయాదిలో కొత్త వణుకు

By:  Tupaki Desk   |   7 March 2017 10:28 AM GMT
మన జెండాతో దాయాదిలో కొత్త వణుకు
X
భారత్ అంటే దాయాదికి ఎంత భయమన్నది ఓపెద్ద చర్చ అయితే.. తాజాగా మాత్రం ఒక విషయంలో మాత్రం విపరీతమైన ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ దాయాదిని అంతలా ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏమిటంటారా? సరిహద్దుల్లోఏర్పాటు చేసిన మన త్రివర్ణ పతాకమే. భారీ జెండాను ఇటీవల పాకిస్థాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో భారీ జాతీయ జెండాల్నిఏర్పాటు చేసే ధోరణి ఎక్కువ అవుతోంది. తాజాగా పంజాబ్ లోని అమృత్ సర్ అటారీ సరిహద్దు వద్ద దాదాపు 360 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఇది 300 అడుగుల ఎత్తులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో 290 అడుగుల ఎత్తులో జాతీయజెండాను ఏర్పాటు చేశారు. వీటన్నింటికి కంటే సరిహద్దుల దగ్గర ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఎత్తైనది.

దేశంలో అత్యంత ఎత్తైన జెండాను ఏర్పాటు చేసిన భారత్ తీరుపై పాక్ తెగ ఆందోళన చెందుతుందట. లాహోర్ నగరం నుంచి కూడా కనిపించే ఈ జెండాలో రహస్య కెమేరాలు ఏర్పాటు చేసి తమపై నిఘా పెట్టారా? అన్నది దాయాది సందేహంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని పాక్ రేంజర్లు కూడా కొట్టిపారేయకపోవటాన్ని చూస్తే.. వారిలో టెన్షన్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. రహస్య కెమేరాల ఆలోచన తమకు అస్సలు లేదని బీఎస్ ఎఫ్ కొట్టి పారేస్తోంది. దాదాపు రూ.3.5కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ జెండా పాక్ కు దడ పుట్టిస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/