Begin typing your search above and press return to search.

పాక్‌ కు గట్టి దెబ్బ:ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే అంతే సంగతులు..

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:26 AM GMT
పాక్‌ కు గట్టి దెబ్బ:ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే అంతే సంగతులు..
X
ఉగ్రవాదం... ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే దేశం పాకిస్థాన్. దశాబ్దాలు పాటుగా పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా నిలుస్తూ వస్తుంది. ఉగ్రవాదాన్ని అరికట్టాలని ఇండియాతో సహ అంతర్జాతీయ సమాజం ఎంత హెచ్చరించిన పాకిస్థాన్ తన పంథా మార్చుకోవడం లేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఏటీఎఫ్) సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఎఫ్‌ ఏ‌టి‌ఎఫ్ ఫ్రాన్స్ వేదికగా పని చేస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందే మార్గాలను నిరోధిస్తుంది. అందులో భాగంగా గానే ఎఫ్‌ఏ‌టి‌ఎఫ్ గతంలో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాక్ ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే 27 సిఫార్సులు చేసి వాటిని అమలు చేయాలని కోరింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎఫ్‌ ఏ‌టి‌ఎఫ్ సిఫార్సులని పట్టించుకోలేదు, 27 సిఫార్సుల్లో కేవలం 6 మాత్రమే అమలు చేసింది. దీంతో ఎఫ్‌ ఏ‌టి‌ఎఫ్ పాక్ ను ‘డార్క్ గ్రే’ లిస్టులో పెట్టాలని భావిస్తోంది.

అయితే ఎఫ్‌ ఏ‌టి‌ఎఫ్ ఏ దేశాన్నైనా ‘డార్క్ గ్రే’ లిస్ట్ లో పెడితే..ఆ తర్వాత బ్లాక్ లిస్టులోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా మనీ లాండరింగ్ - ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఏ దేశమైనా సహకరించకపోతే ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెడతారు. పాక్ ఇప్పుడు ఉగ్రవాదులకు అండగా ఉంది కాబట్టి..ఆ దేశాన్ని బ్లాక్ లిస్టు లో పెట్టే అవకాశముంది. దీని వల్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటివి పాక్ కు గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది.

కాగా, ప్రస్తుతం ప్యారిస్ లో ఎఫ్‌ఏ‌టి‌ఎఫ్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో పాక్ కు ఒక్క సభ్య దేశం కూడా మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బ్లాక్ లిస్ట్ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి పాక్ ఇటీవల పలువురు ఉగ్రవాద నేతలను అరెస్టు చేసింది.