Begin typing your search above and press return to search.

పాక్‌ లో మంచి పనులు కూడా జ‌రుగుతుంటాయి

By:  Tupaki Desk   |   19 Oct 2017 6:40 AM GMT
పాక్‌ లో మంచి పనులు కూడా జ‌రుగుతుంటాయి
X
మంచిని మంచిగా...చెడును చెడుగా మాట్లాడుకోవ‌డం ప‌రిణ‌తి చెందిన వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నం. చెడ్డ‌వారిలో కూడా మంచి ల‌క్ష‌ణం ఒక‌టో అరా ఉంటుందంటారు... అలాగే మంచి వారిలో కూడా బ‌య‌ట‌ప‌డ‌ని చెడు ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే...కుట్ర‌పూరిత‌ దేశంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముద్ర‌ప‌డ్డ పాకిస్తాన్ ఓ గొప్ప నిర్ణ‌యం తీసుకుంది. పాక్‌ ను మనం ఆగర్భ శత్రువుగా పరిగణిస్తాం. ఆ దేశంలో ఎలాంటి చట్టాలు అమలుకావని విశ్వసిస్తాం. పాక్‌ అంటే పూర్తిగా తీవ్ర వాదులు - ఉగ్రవాదుల సమూహంగానే భావిస్తాం. భారత్‌ ను నాశనం చేయడమొక్కటే ఆ దేశ లక్ష్యంగా మనం పరిగణిస్తాం. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి సంఘటనలు జరిగినా స్పందిస్తాం గాని.. పాక్‌ లో జరిగే ఏ సంఘటనకు సానుకూలంగా స్పందించం. అసలు దాని గురించి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కూడా భావించం.

అయితే ఇటీవల కాలంలో పాక్‌ లో కూడా అంతర్జాతీయ సమాజం మెచ్చుకునే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలె ప్రపంచవ్యాప్తంగా అందమైన రాజధాని నగరాలపై అధ్యయనం జరిగింది. ఇందులో లండన్‌ తొలి స్థానంలో ఉంటే పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లోనే బెర్లిన్‌ - వాషింగ్టన్‌ - ప్యారీస్‌ - రోమ్‌ - టోక్యో - బుడాఫెస్ట్‌ - ఒట్టావాలు నిల్చాయి. పది అగ్రశ్రేణి అందమైన రాజధాని నగరాల జాబితాలో రష్యా రాజధాని మాస్కో పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం పాక్‌ లో సంప్రదాయం. అలాగే భారత్‌ ను మించి అవినీతి రాజకీయవేత్తలు పాక్‌ నేలుతున్నారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా స్పందన లోనూ ఇప్పుడు పాక్‌ ముందంజ వేస్తోంది. ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమారులు ముగ్గురూ లండన్‌ లో అత్యంత విలువైన ఆస్తుల్ని కూటగట్టారంటూ పనామాలీక్స్‌ వెల్లడించగానే ప్రధానిపై కూడా అక్కడ కేసు నమోదుచేశారు. ఇస్లామాబాద్‌ చట్టాల మేరకు విచారణను ఎదుర్కొంటున్న వారెవరూ అధికారిక పదవుల్లో కొనసాగేందుకు వీల్లేకపోవడంతో వెంటనే నవాజ్‌ ను ప్రధాని పదవి నుంచి తొలగాల్సిందిగా ఆ దేశ సర్వో న్నత న్యాయస్థానం ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో షరీఫ్‌ పదవీచ్యుతుడు కావాల్సొచ్చింది.

తాజాగా పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఆ దేశ ప్రజాప్రాతినిద్య చట్ట ప్రకారం ఎన్నికై అధికారిక పదవుల్లో కొనసాగుతున్నవారంతా విధిగా ఏటేటా తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి. ఇలాంటి చట్టం దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే దీనికి స్పందించే ప్రజాప్రతినిధుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంటోంది. ప్రకటించకపోయినప్పటికీ ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం నోటీసులివ్వడం మినహా అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఈ ఏడాది ఇంతవరకు ఆస్తుల వివరాలు వెల్ల డించని మొత్తం 261మంది ప్రజాప్రతినిధుల్ని తమ పదవుల నుంచి సస్పెండ్‌ చేస్తూ పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసేసింది. ఇందులో 71మంది ఎంపీలున్నారు. ఏడుగురు సెనేటర్లు కూడా ఉన్నారు. మిగిలిన వారంతా అసెంబ్లీ సభ్యులు.

బలుచీస్థాన్‌ ఎమ్మెల్యేలు 11మంది - ఖైబర్‌ ఫక్తూన్‌ క్వా ఎమ్మెల్యేలు 38మంది - సింధ్‌ ఎమ్మెల్యేలు 51మంది - పంజాబ్‌ ఎమ్మెల్యేలు 84మందున్నారు. అంతేకాదు.. పదవీచ్యుతుడైన ప్రధాని షరీఫ్‌ అల్లుడు కెప్టెన్‌ మహ్మద్‌ సబ్దర్‌ - పాకిస్థాన్‌ మత వ్యవహారాల శాఖామంత్రి సబ్దర్‌ యూసఫ్‌ - పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ ఫెహ్‌ మిదామిర్జా కూడా సస్పెండైన జాబితాలో ఉన్నారు. వీరంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ఎన్నికల కమిషన్‌ కు అందించాల్సిఉంది. మంగళవారం నుంచే వీరి సస్పెన్షన్‌ అమల్లోకొచ్చింది. అయితే ఈ నెల 30వ తేదీ వరకు తుది గడువిచ్చారు. అప్పటివరకు వీర్ని అధికారిక పదవుల్లో ఉన్నవారిగా గుర్తించరు. ఎలాంటి అధికారిక లాంఛనాలు వీరికివర్తించవు. 30వ తేదీలోగా ఆస్తుల వివరాల్ని అందిస్తే సస్పెన్షన్‌ ఎత్తేస్తారు. లేనిపక్షంలో తొలగింపు ఖాయమౌతుంది.

ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్ర్యం అనంత‌రం నుంచి మ‌న‌ దేశంలో ప్రజాస్వామ్యం తప్ప మరేంలేదు. భారత్‌ కు స్వతంత్ర్య‌మొచ్చినప్పుడే ఆవిర్భవించిన పాకిస్థాన్‌ లో నాలుగింట మూడొంతుల కాలం మిలటరీ ఏలుబడిలోనే సాగింది. అప్పుడప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం మిణుకు మిణుకుమంటూ కనిపిస్తుంటుంది. అలాంటి మ‌న శత్రుదేశంలో పాక్‌ లో ఇలాంటి కఠిన నిర్ణయాల అమలుతీరును పరిశీలించాల్సిన ఆవశ్యకత నెలకొందని అంటున్నారు. ముఖ్యంగా అవినీతి - ప్రజాప్రతినిధులు - ఉన్నతాధికారుల వ్యక్తిగత - కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల విషయంలో ఇలాంటి కఠిన నిర్ణయాల్ని అభినందించాల్సిందేనని అంతర్జాతీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.