Begin typing your search above and press return to search.

ఉగ్ర‌వాదంపై పాకిస్థాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. గ‌తంలో ఎవ‌రూ విని ఉండ‌రు బాస్‌!!

By:  Tupaki Desk   |   1 Feb 2023 8:07 PM GMT
ఉగ్ర‌వాదంపై పాకిస్థాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. గ‌తంలో ఎవ‌రూ విని ఉండ‌రు బాస్‌!!
X
దేశ ప్ర‌జ‌ల‌కు క‌నీస స‌దుపాయాలు క‌ల్పించ‌డంలోనేకాదు.. ఆహారం కూడా పెట్ట‌లేని ప‌రిస్థితికి దిగ‌జారిపోయిన పాకిస్థాన్ త‌న‌ను తాను తెలుసుకుంటోంది. ఇంకేముంది.. అణు స‌త్తా ఉంద‌ని.. ఇటీవల కూడా ప్ర‌క‌టించిన దేశం అన్నానికి అల‌మటించి పోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో త‌నేమిటో తాను త‌డిమి చూసుకుంది. త‌న గతేంటో.. ఎందుకింత దుర్భ‌ర స్థితి దాపురించిందో కూడా తెలుసుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఎవ‌రూ క‌న‌ని విన‌ని.. క‌నీసం ఊహించ‌ని వ్యాఖ్య‌లు కూడా చేసింది. ఉగ్ర‌వాదాన్ని తామే పెంచి పోషించామ‌ని.. దీనికి లెంప‌లేసుకుంటున్నామ‌ని.. పాకిస్థాన్ తాజాగా ప్ర‌క‌టించ‌డం.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది.

ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ భారత్‌తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. అంతేకాదు.. తామేమిటో కూడా తెలుసుకున్నామ‌ని చెప్పారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్... రెండు రోజుల కింద‌ట‌ పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి తర్వాత మ‌రిన్ని మెట్లు దిగి వ‌చ్చారు. ఉగ్రవాద బీజాలను తామే నాటామని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పాకిస్థాన్‌లోని కైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్ రాజధాని నగరం పెషావర్‌లో సోమవారం దారుణం జరిగింది. ఓ మసీదులో దాదాపు 400 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 170 మంది వరకు గాయపడ్డారు. దీనికి ఉగ్ర‌వాదులే కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వం స్వ‌యంగా ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో మంత్రి ఖవాజా అసిఫ్ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఉగ్రవాద బీజాలను పాకిస్థానే నాటిందని చెప్పారు. ‘‘నేను ఎక్కువగా మాట్లాడను, క్లుప్తంగానే మాట్లాడతాను. మొట్టమొదటిది, ఉగ్రవాద బీజాలను మనమే నాటాం. పెషావర్‌లోని మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతికి పాల్పడిన బాంబర్ జుహ్ర్ ప్రేయర్స్‌లో ముందు వరుసలో నిల్చున్నాడు. ప్రార్థన చేసుకునేవారు కనీసం భారత దేశం లేదా ఇజ్రాయిల్‌లోనైనా అమరులుకాలేదు, కానీ అది పాకిస్థాన్‌లో జరిగింది. ఈ పేలుడుకు ఎవరిని జవాబుదారీ చేయాలి?`` అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. ``ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దానిని ఓడించవచ్చు. ఉగ్రవాదం ఏదైనా మతం లేదా వర్గం మధ్య తేడాను చూపించదు. విలువైన ప్రాణాలను తీసేందుకు మతం పేరుతో ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న ప్రపంచాన్ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆది నుంచి కూడా భార‌త్‌.. పాకిస్థాన్ వైపు వేలు చూపించింది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఎదురు దాడి చేస్తూ.. వ‌చ్చిన పాక్ ప్ర‌భువులు.. ఇప్పుడు.. త‌మ దాకా వ‌చ్చి.. 100 మంది చ‌నిపోయిన త‌ర్వాత‌.. ప్ర‌పంచం ముందు మోక‌రిల్లారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.