Begin typing your search above and press return to search.

శ‌బ‌రిమ‌ల హుండీలో పాక్ క‌రెన్సీ!

By:  Tupaki Desk   |   6 July 2017 2:35 PM GMT
శ‌బ‌రిమ‌ల హుండీలో పాక్ క‌రెన్సీ!
X
కేరళలో ప్ర‌ఖ్యాతి గాంచిన‌ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో క‌ల‌క‌లం రేగింది. అక్క‌డి హుండీలో దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన క‌రెన్సీ ల‌భించ‌డంతో ఆల‌య అధికారులు విస్మ‌యానికి గుర‌య్యారు. హుండీలోని డబ్బును లెక్కిస్తుండగా, పాక్ కు చెందిన 20 రూపాయల నోటును ఆల‌య అధికారులు గుర్తించారు.

ఇటీవల జ‌రిగిన ప్రత్యేక పూజలు - ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దేవాలయాల హుండీల్లోకి విదేశీ భ‌క్తులు వ‌చ్చిన‌పుడు విదేశీ కరెన్సీ రావడం స‌హ‌జం. అందులోనూ సుప్ర‌సిద్ధ శ‌బ‌రిమ‌ల అయ్యప్ప హుండీలో పలు దేశాల కరెన్సీ నోట్లు కానుకలుగా వస్తుంటాయి.

అయితే, ఈ హుండీలో ఇలా పాక్ కరెన్సీ కనిపించడం మాత్రం ఇదే తొలిసారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నామ‌ని, ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం తెలిపామని పథనంతిట్ట ఎస్పీ సతీష్ మీడియాకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ల నిశితంగా పరిశీలించామని, ఈ నోటును ఎవ‌రు వేశారో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని చెప్పారు. ఒక‌వేళ ఆక‌తాయిలెవ‌రన్నా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి ఉండ‌వచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాధార‌ణంగా ఇత‌ర దేశాల భ‌క్తులు శ‌బ‌రిమ‌ల‌కు వ‌చ్చిన‌పుడు డాల‌ర్లు - రియాద్ లు - పౌండ్ లు - దిర్హ‌మ్ లు హుండీలో వేస్తుంటారు. దేవాల‌య అధికారులు ఆ నోట్ల‌ను ఆల‌య ప్ర‌ధాన బ్యాంకు ఖాతా ఉన్న ధ‌న‌ల‌క్ష్మి బ్యాంకుకు పంపుతారు. బ్యాంకు అధికారులు ఆ విదేశీ క‌రెన్సీకి స‌మాన‌మైన భార‌త క‌రెన్సీని శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌ధాన బ్యాంకు ఖాతాలోకి బ‌దిలీ చేస్తారు.