Begin typing your search above and press return to search.

పాక్ కోర్టులో ఇలా న్యాయం చెబుతారా?

By:  Tupaki Desk   |   9 Feb 2020 1:30 AM GMT
పాక్ కోర్టులో ఇలా న్యాయం చెబుతారా?
X
ఇదెక్కడి దారుణంరా బాబు అన్నట్లుగా ఉండే కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. ఇలాంటి తీర్పులు ఇవ్వటం దాయాది పాకిస్థాన్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. సాధారణంగా ఏ దేశంలోని కోర్టులు అయినా మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి చేస్తామంటూ కన్నెర్ర చేస్తాయి.. కఠినమైన శిక్షలు వేసేందుకు వెనుకాడవు. అలాంటిది అందుకు భిన్నమైన తీర్పు చెప్పిన వైనం పాక్ లో చోటుచేసుకుంది.

పాక్ కోర్టు ఇచ్చిన తీర్పు విన్నంతనే ప్రపంచంలోని పలుదేశాల వారు అవాక్కు అవుతున్నారు. షరియా చట్టం ప్రకారం తాను తీర్పు చెబుతున్నట్లు చెప్పి.. మైనర్ అయిన అమ్మాయి అయినా సరే.. పీరియడ్స్ కానీ రెగ్యులర్ గా వస్తున్న అమ్మాయికి పెళ్లి చేయటం తప్పేం కాదన్న మాట సదరు జడ్జి నోటి నుంచి రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

పాకిస్థాన్ కు చెందిన 14 ఏళ్ల హుమా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. క్రిస్టియన్ మతానికి చెందిన ఈ బాలికను గత ఏడాది అక్టోబరులో అబ్దుల్ జబ్బర్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. పాక్ లో మైనార్టీలుగా ఉండే మతస్తుల అమ్మాయిల్ని వారి ఇష్టం కానీ వారి కుటుంబ సభ్యుల ఇష్టంతో పని లేకుండా ఎత్తుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవటం అలవాటే.

దీనిపై పలువురు తప్పు పడుతున్నా.. పాక్ లోని వారే కాదు.. మన దేశంలోని మానవహక్కుల వాదుల నోట్లో నుంచి ఒక్కటంటే ఒక్క ఖండన కూడా వెలువడదు. ఆ విషయాన్ని పక్కన పెట్టి.. పాక్ లో జరిగిన దారుణంలోకి వెళితే.. అలా ఎత్తుకెళ్లిన పద్నాలుగేళ్ల చిన్నారిని ఆ మగాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి తల్లిదండ్రుల వద్దకు కూడా పంపలేదు. దీంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించాలని.. బాలికకు మైనార్టీ కూడా తీరలేదంటూ కోర్టును ఆశ్రయించారు.

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు షాకింగ్ తీర్పును ఇచ్చింది. బాలికకు మైనార్టీ తీరకున్నా.. క్రమం తప్పకుండా పీరియడ్స్ (రుతుక్రమం) వస్తుంది కాబట్టి.. ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నా అది చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. షరియా చట్టం ప్రకారం ఒక్క నెల పీరియడ్స్ వచ్చినా చాలని.. ఆ పెళ్లి చెల్లుతుందంటూ సింధ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బాలిక తల్లిదండ్రులు షాక్ తిన్నారు.

కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పుతో అవాక్కు అయిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తె వయసును చెప్పే ధ్రువీకరణ పత్రాల్ని కోర్టుకు సమర్పించారు. కోర్టు తీర్పు వెలువడే వరకూ.. ఆమెను ఏదైనా మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచాలని వారు కోరుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పాక్ సుప్రీంకోర్టు ఇంకా తీర్పును వెలువరించలేదు. ఈ ఉదంతం విన్నవారు నోటి వెంట మాట రాని పరిస్థితి.