Begin typing your search above and press return to search.

ప్రజల నుంచి భారీగా బంగారం సేకరించనున్న పాక్.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   22 Feb 2022 2:30 AM GMT
ప్రజల నుంచి భారీగా బంగారం సేకరించనున్న పాక్.. కారణం ఇదే!
X
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా క్షీణించాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత చాలా దేశాలు ఆర్థికంగా వెనుకబడి పోయాయి. ఇలాంటి దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు పాక్ విదేశాల నుంచి అప్పును కొంత కొంతగా తీసుకుంటూ ఉంది.

ముఖ్యంగా పక్కనున్న చైనా నుంచి పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకుంది. అందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. కానీ అనుకున్న విధంగా చైనాకు భారీ మొత్తంలో చెల్లింపులు కూడా చేసింది.

అయితే ప్రస్తుతం పాక్ దగ్గర విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల దగ్గర ఉండే బంగారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు.

ఇలా ప్రజల నుంచి బంగారాన్ని సేకరించడం ద్వారా విదేశీ మారక నిల్వలు ఎక్కువ చేసి చూపించవచ్చని చెప్తున్నారు. దీంతో మరి కొంత అప్పు ఆ దేశానికి ఇచ్చేందుకు ఇతర దేశాలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రజల నుంచి సేకరించిన బంగారం ఎక్కడ ఉంచాలనే నిర్ణయం పై కూడా ఓ అంచనాకు వచ్చారు పాక్ అధికారులు.

ముందుగా ప్రజల నుంచి సేకరించిన బంగారాన్ని కమర్షియల్ బ్యాంకు ల్లో ఉంచే ప్రతిపాధన బలంగా వినిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా నిల్వలను చూపించేందుకు మంచి ఆధారం దొరుకుతుందని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.

నానాటికీ క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఈ విధంగా పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పాక్‌ ఎకనమిక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుని ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ముందుగా ప్రజల నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకుంటారు. అలా తీసుకున్న పుత్తడిని కమర్షియల్‌ బ్యాంకుల్లో ఉంచుతారు. వాటికి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు వడ్డీని చెల్లిస్తారు.

ఈ మొత్తం బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌లో డిపాజిట్‌ చేస్తారు. ఇలా చేసిన దానిని విదేశీ నిల్వలు పెంచుకోవడానికి వినియోగిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పాక్ లో ఉండే ప్రజల దగ్గర మొత్తంగా 5 వేల టన్నుల మేర బంగారం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.