Begin typing your search above and press return to search.

విదేశాలకు 'చెత్తకుండీ'లా పాకిస్తాన్: ఏటా 80 వేల వ్యర్థాలు..

By:  Tupaki Desk   |   2 July 2022 9:30 AM GMT
విదేశాలకు చెత్తకుండీలా పాకిస్తాన్: ఏటా 80 వేల వ్యర్థాలు..
X
పాకిస్థాన్ దేశం విదేశాలకు 'చెత్త కుండీ'లా మారిపోతుందా..? విదేశాల నుంచి భారీగా వ్యర్థాలను సేకరిస్తుందా..? ఏయే దేశాల నుంచి వ్యర్థాలను తెచ్చుకుంటోంది..? ఆ వ్యర్థాలను ఏం చేయబోతుంది..? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తమ దేశానికి ఇంత పెద్ద మొత్తంలో వ్యర్థాలు దిగుమతి అవుతున్న విషయం అక్కడి కొందరు ప్రజాప్రతినిధులకు కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇలాంటి వ్యర్థాల సేకరణతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ పార్లమెంట్ లో ఓ చట్టసభ్యుడు ఈ విషయంపై ఆక్రోశం వెల్లగక్కాడు.

సూర్య నటించిన సింగం-3 సినిమాలో విలన్ ఆస్ట్రేలియా నుంచి వ్యర్థాలను ఇండియాకు తరలిస్తారు. ఇందుకోసం ఓ సముద్రం ఒడ్డున డంప్ యార్డును ఏర్పాటు చేస్తారు. అయితే ఈ డంప్ యార్డ్ నుంచి వచ్చిన విష పదార్థాలతో కొంత మంది పిల్లలు మరణిస్తారు.

భవిష్యత్ లో పాకిస్తాన్ లో ఇలాంటి మరణాలే జరుగుతాయనే విధంగా పార్లమెంట్ లో ఓ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశాడు. పలు విదేశాల నుంచి వ్యర్థాల దిగుమతి పట్ల పాకిస్తాన్ ఎన్నడూ అభ్యంతరం చెప్పదని, సంబంధిత రాష్ట్రాలు, శాఖలు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించవని ఆయన అన్నాడు.

ఈ సమయంలో పాకిస్తాన్ చెత్తకుండీలా మారుతోందా..? అన్న ప్రశ్నకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమాధానం ఇచ్చింది. దేశంలో ఏటా 30 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, ఇదే సమయంలో 80 టన్నులు వ్యర్థాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపింది. సౌదీ అరేబియా, కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ వంటి దేశాల నుంచి ఎక్కువగా వర్థాలు వస్తున్నాయని తెలిపింది.

అయితే ఇన్ని వ్యర్థాలు దేశంలో వచ్చిపడడంతో ఇక్కడి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీంతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఓ డంప్ యార్డుగా మారిందని అంటున్నారు.దేశంలో ఏ మూల చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.

అయితే ఇలా విదేశాల నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి బంగారాన్ని ఉత్పత్తి చేస్తోందని 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' పేర్కొంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నుంచి ఏటా 80 వేల టన్నులను దిగుమతి చేసుకొని వాటితో బంగారం, కాపర్, అల్యూమినియం ఖనిజాలను ఉత్పత్తి చేస్తోందని తెలుపుతోంది. కానీ ఈ భారీగా వ్యర్థాలను దిగుమతి చేసుకోవడంతో ఈ ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' తెలిపింది.