Begin typing your search above and press return to search.

44 మంది అరెస్ట్‌..మ‌సూద్ కొడుకు - సోద‌రుడు కూడా

By:  Tupaki Desk   |   6 March 2019 6:00 AM GMT
44 మంది అరెస్ట్‌..మ‌సూద్ కొడుకు - సోద‌రుడు కూడా
X
పాకిస్థాన్ దారికి వ‌స్తోంది! భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగడంతో ఉగ్రవాద గ్రూపులపై చర్యలకు పాకిస్థాన్ అధికారులు ఉపక్రమించారు. వివిధ సంస్థలకు చెందిన 44 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ)తోపాటు దానికి అనుబంధంగా పనిచేస్తున్న ఫలాయే ఇన్సానియత్ ఫౌండేషన్‌ ను నిషేధిత సంస్థల జాబితాలో చేర్చారు. తాజాగా అరెస్టయిన ఉగ్రవాదుల్లో జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్ కుమారుడు హమ్మద్ అజర్ - సోదరుడు ముఫ్తీ అబ్దుర్ రవూఫ్ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదులకు భద్రత కల్పించేందుకే ఈ చర్యలని భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఈ అరెస్టులు జరుగలేదని పేర్కొంది.

పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను కట్టడి చేయాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మంది సభ్యులను పాక్ అధికారులు అరెస్టు చేయడంతోపాటు కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ)తోపాటు దానికి అనుబంధంగా పనిచేస్తున్న ఫలా ఇ ఇన్సానియత్ (ఎఫ్‌ ఐఎఫ్) ఫౌండేషన్‌ ను నిషేధిత సంస్థల జాబితాలో చేర్చారు. తాజాగా అరెస్టు చేసిన ఉగ్రవాదుల్లో జైషే మహమ్మద్ (జేఈఎం) అధిపతి మసూద్ అజర్ కుమారుడు హమ్మద్ అజర్ - సోదరుడు ముఫ్తీ అబ్దుర్ రవూఫ్ కూడా ఉన్నట్టు పాక్ హోంశాఖ సహాయ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ - ఆ శాఖ కార్యదర్శి ఆజం సులేమాన్ ఖాన్ తెలిపారు.

భారత్ గత వారం పాకిస్థాన్‌ కు సమర్పించిన జాబితాలో ముఫ్తీ అబ్దుర్ రవూఫ్ - హమ్మద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. పుల్వామాలో గత నెల 14న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై పాక్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇవన్నీ కంటి తుడపు అరెస్టులేనని భారత భద్రతా సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాక్ అధికారులు ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఈ అరెస్టులను చేయలేదని - దర్యాప్తు పేరుతో ఉగ్రవాదులకు భద్రత కల్పించేందుకే ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారని విమర్శిస్తున్నాయి. ప్రతిపాదిత ఉగ్రవాద సంస్థల నేతలను పాక్ అధికారులు గతంలోనూ అరెస్టు చేసినప్పటికీ వివిధ కారణాలతో వారిని త్వరగానే విడిచిపెట్టారని, అవన్నీ బూటకపు అరెస్టులేనని భారత భద్రతాదళ ఉన్నతాధికారి వివ‌రించారు.