Begin typing your search above and press return to search.

క‌న్‌ ఫార్మ్‌!...పాక్ ఉగ్ర‌వాద దేశ‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   20 July 2017 5:43 AM GMT
క‌న్‌ ఫార్మ్‌!...పాక్ ఉగ్ర‌వాద దేశ‌మేన‌ట‌!
X
భార‌త్‌ లో అల్ల‌క‌ల్లోల‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌డమే కాకుండా... భార‌త భూభాగంలో అంత‌ర్భాగ‌మైన జ‌మ్మూ కాశ్మీర్‌ ను లాగేసుకునే య‌త్నంలో భాగంగా అక్క‌డ ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక చేయూత కూడా ఇస్తున్న పాకిస్థాన్‌ కు త‌న పాపం పండిన రోజు అతి ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌న్న విష‌యం ఇప్ప‌టికి దాదాపుగా అర్థ‌మైపోయి ఉంటుంద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఆర్థికంగా అంత‌గా బ‌ల‌మైన దేశ‌మేమీ కాని పాకిస్థాన్‌... అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ఇస్లామిక్ దేశాల నుంచి అందే సాయం కోసం నిత్యం ఎదురు చూస్తూనే ఉంటుంద‌న్న విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. అయితే ఇటీవ‌లి కాలంలో పాక్ భూభాగంపై పుట్టి పెరుగుతున్న ఉగ్ర‌వాదం జ‌డ‌లు విప్పింది. అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితుల‌కు ప‌క్కాగా ప్లాన్ వేస్తున్న ఉగ్ర‌వాదులు... భార‌త్‌ ను అస్థిర‌ప‌రిచేందుకు చేయ‌ని య‌త్న‌మంటూ లేదు.

అయితే ఇటీవ‌ల మోదీ స‌ర్కారు సంధించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ తో అస‌లు పాక్ వైఖ‌రి ఏమిటో అమెరికాకు కొత్త అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌లు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ కు అర్థ‌మైన‌ట్లు ఉంది. అంతేకాకుండా ఇప్ప‌టికే రెండు ప‌ర్యాయాలు మోదీతో భేటీ అయిన ట్రంప్‌... పాక్ వైఖ‌రిపై పూర్తి స్థాయి అవగాహ‌న తెచ్చుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ట్రంప్ స‌ర్కారు తీసుకున్న రెండు కీల‌క నిర్ణ‌యాల‌ను ప‌రిశీలిస్తే... ఈ విషయం నిజ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం ఇస్తుంద‌న్న కార‌ణంగా పాకిస్థాన్‌ కు అంద‌జేస్తున్న సాయాన్ని తొలుత పాక్షికంగా నిలిపివేసిన ట్రంప్ స‌ర్కారు... ఇటీవ‌లే దానిని పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా పాకిస్థాన్ షాక‌య్యేలా మ‌రో నిర్ణ‌యాన్ని కూడా ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోవ‌డం కూడా సాధ్యం కాదేమో అన్న వాదన వినిపిస్తోంది.

ఇక ట్రంప్ తీసుకున్న ఆ సంచ‌ల‌న నిర్ణ‌యం విష‌యానికి వ‌స్తే... ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ను కూడా చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జైషే మహ్మద్ - లష్కరే తాయిబా తదితర ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా విహరిస్తూ - నిధులను సేకరిస్తూ - ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాయని అమెరికా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ట్రాన్స్ సహారా - సోమాలియా - ఆఫ్ఘనిస్థాన్ - సులవేసీ సీస్ లిట్టోరల్ - దక్షిణ ఫిలిప్పైన్స్ - ఇరాక్ - లెబనానా - ఈజిప్ట్ - యెమన్ - లిబియా - వెనెజువెలా - కొలంబియాల సరసన పాకిస్థాన్ ను కూడా చేర్చింది. దీంతో, ప్రపంచ దేశాల దృష్టిలో ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న దేశంగా పాకిస్థాన్ అపప్రదను మూటగట్టుకున్నట్టైందన్న వాద‌న వినిపిస్తోంది. వెర‌సి ఈ నిర్ణ‌యంతో పాక్‌ కు ఇత‌ర దేశాల నుంచి అందుతున్న సాయం కూడా నిలిచిపోయే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.