Begin typing your search above and press return to search.

ఆఖరుకు పాకిస్తాన్ కూడా భారత్ కు సాయం చేస్తాననే దుస్థితి.. తప్పెవరిది?

By:  Tupaki Desk   |   25 April 2021 8:30 AM GMT
ఆఖరుకు పాకిస్తాన్ కూడా భారత్ కు సాయం చేస్తాననే దుస్థితి.. తప్పెవరిది?
X
ఇంత బతుకు బతుకీ.. తొలి కరోనా వేవ్ ను తట్టుకొని.. అల్లకల్లోలమైన అమెరికాకు మన మందులు పంపించి సాయం చేసి.. కరోనా తీవ్రతతో ఉన్న దేశాలకు వైద్య సామగ్రిని అందించిన భారతదేశం ఇప్పుడు శత్రుదేశం పాకిస్తాన్ కూడా సాయం చేస్తాననే స్థాయికి దిగజారిందంటే దేశంలో పరిస్థితులు ఏ తీరుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ సాయం చేస్తానని ముందుకు వచ్చిందంటే అంతకంటే ఘోరమైన పాలన వైఫల్యం మన పాలకులకు మరొకటి లేదని చెప్పొచ్చు. ఎలా ఉండే భారత్ ఎలా అయ్యింది.. ఏడాదిలో మొత్తం కథ మారిపోయింది.. సాయం చేసే స్థాయి నుంచి కరోనా విలయంతో ఆఖరుకు పాకిస్తాన్ కూడా సాయం చేసే స్థాయికి దిగజారిందంటే అంతకంటే అవమానం మోడీ సర్కార్ కు మరొకటి లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా విలయానికి కేంద్రంలోని మోడీ సర్కార్ తప్పు ఎంత ఉందో.. అలానే కరోనా నిబంధనలు పాటించక లాక్ డౌన్ ముగిశాక విచ్చలవిడిగా తిరిగిన ప్రజలదీ అంతే ఉంది. ఇక నాయకులు నిర్లక్ష్యం కూడా కాదనలేనిది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో కరోనా విలయానికి అందరి తప్పు ఉంది. కానీ మొదటి వేవ్ లో ఎంతో కట్టడి చేసిన మోడీ సార్ రెండో వేవ్ లో దేశంలో ఎన్నికలకు పురమాయించి కరోనాను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న అపవాదు తెచ్చుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనాపై చూపించలేదంటున్నారు.

ఒక సారి కరోనా దెబ్బ కొట్టాక తొలి వేవ్ ను పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ పెట్టి సమర్థంగా తట్టుకున్న మోడీ రెండో వేవ్ ను గాలికొదిలేశాడన్న ఆరోపణలు తెచ్చుకున్నారు. ఈ ఆక్సిజన్ కొరతను, మందులను వెంటిలేటర్లను సమకూర్చుకోకపోవడం పెద్ద తప్పుగా చెప్పొచ్చు. ఇక టీకాలు అందుబాటులోకి వచ్చాక ఏదో ప్రపంచ పెద్దన్న అన్నట్టు అన్ని దేశాలకు ఉచితంగా మిలియన్ల వ్యాక్సిన్లు పంపించి పేరు తెచ్చుకున్న మోడీ.. ఇప్పుడు దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతకు కారణమయ్యాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. బిల్డప్ కు పోయే ముందు ఆయన సొంత దుకాణం (దేశాన్ని) పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శకులు కడిగేస్తున్నారు.

ఇప్పుడు దేశంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. టీకాలు సరిపడా లేవు. ఆస్పత్రులు నిండిపోయాయి. ఇంత దారుణమైన పరిస్తితుల్లో గత ట్రంప్ సర్కార్ కు మందులు, వైద్య సామగ్రి పంపిన భారత దేశానికి ఇప్పుడు జోబైడెన్ సర్కార్ మాత్రం భారత్ కు సాయం చేయడానికి మీనమేశాలు లెక్కిస్తోంది. అక్కడి భారతీయులు ఎంత ఒత్తిడి తెచ్చినా ముందు వెనుకా ఆలోచిస్తోంది.

ఇక సింగపూర్ దేశం మాత్రం ఉన్న ఫళంగా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి భారత్ కు సాయం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని సైతం భారత్ లో కరోనా విలయానికి తాము సాయం చేస్తామని.. వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్సెరే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రి పంపిస్తామనడం విశేషం.

పీకల్లోతు అప్పుల్లో పాలన వైఫల్యాలతో అట్టుడికే పాకిస్తాన్ సైతం కరోనాను నియంత్రించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రపంచానికే వైద్యంలో కేంద్రబిందువైన భారత్ దేశం ఇప్పుడు కొరతతో అల్లాడుతుందంటే ఖచ్చితంగా ఇది మోడీ సర్కార్ వైఫల్యం కాక మరొకటి ఉండదని చెప్పొచ్చు.

అవసరం ఉన్నప్పుడు మనం అన్నీ చేశాం.. ఇప్పుడు అన్ని దేశాలు మనకు సాయం చేస్తానంటున్నాయి. ఇంతకంటే మోడీ సర్కార్ కు అవమానం లేదు. పైగా అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఇది మోడీ వైఫల్యం అంటూ ఆయన ఇన్నాళ్లు అంతర్జాతీయంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలను గంగలో కలిపేస్తున్నాయి. పాపం ఎవరిదైనా సరే ఇలాంటి మహమ్మారుల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోని కేంద్రప్రభుత్వానికి ఇదో గుణపాఠంగా భావించాల్సి ఉంటుంది.