Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర వెలుగులోకి..

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:21 AM GMT
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర వెలుగులోకి..
X
భారత సరిహద్దు వెంట భారత ఆర్మీ, నిఘా తీవ్రతరం కావడంతో ఇప్పుడు ఇక భూగర్భంలోంచి ఉగ్రవాదులు భారత్ లోకి వస్తూ కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా సొరంగాలు తవ్వుకుంటూ వస్తుండడం కలకలం రేపుతోంది.

భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల భారీ పన్నాగం వెలుగుచూసింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ భూభాగంలో నుంచి భారత్ లోకి 150 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు బుధవారం గుర్తించారు.

జమ్మూకశ్మీర్ లోని హిర్నాగర్ సెక్టార్ లో ఉన్న బోబియాన్ గ్రామంలో ఈ సొరంగం వెలుగుచూసింది. ఇది అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న సాంబ, కతువా జిల్లాల్లో గత ఆరు నెలల్లో వెలుగుచూసిన మూడో సొరంగం ఇది. గత పదేళ్లలో ఇది తొమ్మిదవది కావడం గమనార్హం.

తాజా సొరంగం ఉన్న చోట పాక్ వైపు భారీగా లాంచ్ పాడ్లు ఉండడంతోపాటు అది ఉగ్రవాదుల బేస్ లు ఉన్నాయని బీఎస్ఎఫ్ తెలిపింది. సొరంగంలో కొన్ని ఇసుక ప్యాకెట్లు దొరికాయని..వాటిపై పాక్ ముద్ర ఉందని అన్నారు.

గత కొంత కాలంగా ఈ సొరంగం ఉన్న చోట భద్రతా బలగాలు పహారా కాస్తుండడంతో దీన్ని పెద్దగా ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. రెండు నుంచి మూడు అడుగల వ్యాసం ఉన్న సొరంగం దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. ఇసుక సంచులపై ఉన్న తయారీ తేదీలను బట్టి సొరంగాన్ని 2016–17 కాలంలో ఏర్పాటు చేసి ఉంటారని, దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు.