Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ కు షాకిచ్చిన పాక్ ప్రభుత్వం... ఇక అంతా చీకటే!

By:  Tupaki Desk   |   7 Jun 2023 12:15 PM GMT
ఇమ్రాన్ కు షాకిచ్చిన పాక్ ప్రభుత్వం... ఇక అంతా చీకటే!
X
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రెక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ప్రస్తుతం ఫుల్ బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్‌ పై అనేక కేసులు ఉన్నాయి. అవినీతి, రాజద్రోహం, ఉగ్రవాదం, దైవ దూషణ వంటి నేరారోపణలు విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నప్పటికీ... పరిస్థితులు మాత్రం మరీ పగబట్టేసినట్లుగా ఉన్నాయి!

అల్ కదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైనపుడు ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు మే 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్టు చెల్లదని.. తక్షణమే విడుదల చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో... ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకురెండు వారాలపాటు బెయిలు మంజూరు చేసింది. ఈ సమయంలో... పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ... ఇమ్రాన్ కు షాకిచ్చింది.

నాయకుడికి కావాల్సింది పబ్లిసిటీ... తాను చెబుతున్న మాటలు, తాను వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియాను మించిన సాధనం ఉండదు. అయితే... ప్రస్తుతం ఆ సాధనం ఇమ్రాన్ కు అందకుండా చర్యలు తీసుకుంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఫలితంగా... ఇకపై ఇమ్రాన్ ఖాన్... పాకిస్థాన్ మీడియాలో కనిపించేదీ లేదు, ప్రసార మాధ్యమాల్లో ఆయన వాయిస్ వినిపించేదీ లేదు!

అవును... పాకిస్థాన్‌ ప్రభుత్వం పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ను ఆంక్షల చట్రంలో బంధించింది. మీడియా విషయంలో ఆయన పార్టీపై కఠినచర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా... మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన ప్రభుత్వం... ఏ మీడియాలోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రస్థావన తీసుకురాకూడదని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అక్కడి మీడియా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

కాగా మే 9న జరిగిన హింసాత్మక ఘటనలపై అప్పట్లోనే ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల తనను అరెస్టు చేయడంతో చెలరేగిన హింసను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆనాడు జరిగిన హింసాకాండపై విచారణకు ఆదేశించాలని తాను సుప్రీంకోర్టును కోరినట్టు తెలిపారు.

అనంతరం... ఎన్నికల భయం కారణంగానే తనను జైలుకు పంపి ఎన్నికలు జరపడమో, తనను చంపిన తర్వాత ఎన్నికల జరపడమో చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు!