Begin typing your search above and press return to search.

లాడెన్ ను చంపడంలో పాక్ సాయం తీసుకోలేదు: ఒబామా

By:  Tupaki Desk   |   18 Nov 2020 1:30 AM GMT
లాడెన్ ను చంపడంలో పాక్ సాయం తీసుకోలేదు: ఒబామా
X
అమెరికా చరిత్రలో 9/11 ఘటన ఒక చీకటి దినంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ట్విన్‌ టవర్స్ ను‌ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న విషయాన్ని అమెరికన్లు ఎన్నటికీ జీర్ణించుకోలేరు. అమెరికన్లకు ఎన్నో పీడకలలు మిగిల్చిన లాడెన్....9/11 తర్వాత పాక్ లో తలదాచుకున్న ‌లాడెన్‌ ను 2011 మే 2న అమెరికా దళాలు అత్యంత చాకచక్యంగా మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. అబొట్టాబాద్‌ కంపౌండ్‌లో దాక్కున్న లాడెన్‌ ను యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ ద్వారా తుదముట్టించింది. అయితే, లాడెన్ ను మట్టు బెట్టడంలో పాక్ సాయం అమెరికా తీసుకో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకంలో లాడెన్ ను తుద ముట్టించిన నాటి ఘటనలను ఒబామా ప్రస్తావించారు.


లాడెన్ పాక్ లోని అబొట్టాబాద్ లో దాగి ఉందని పక్కాగా ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని ఆనాటి ఘటనలను ఒబామా పుస్తకంలో పొందుపరిచారు. పాక్‌ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే అని ఒబామా అన్నారు. అందుకే, పాక్ సాయం తీసుకోలేదని అన్నారు. అమెరికా ప్రభుత్వంలోని అతి కొద్దిమందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్‌ గురించి తెలుసని చెప్పారు. అందుకే ఆపరేషన్ జరిగేదాకా ఆ విషయం పాక్ మిలిటరీకి కూడా తెలీదని అన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ తనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారని అన్నారు. తన భార్య బెనజీర్‌ భుట్టోను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని జర్దారీ ఉద్వేగానికి గురయ్యారని ఒబామా చెప్పారు.