Begin typing your search above and press return to search.

బిల్‌గేట్స్‌కు కుచ్చుటోపీ..రూ.743 కోట్లు మోసంచేసిన పాక్ వ్యాపారి

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:30 AM GMT
బిల్‌గేట్స్‌కు కుచ్చుటోపీ..రూ.743 కోట్లు మోసంచేసిన పాక్ వ్యాపారి
X
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ను పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యాపార వేత్త అడ్డంగా మోసగించాడా అంటే మోసపోయినట్టు సైమన్‌ క్లార్క్, విల్‌ లోచ్‌ అనే రచయితలు వెల్లడించారు. వాపార దిగ్గజాన్ని ఆయన ఎంత సునాయాసంగా మోసం చేయగలిగాడనే విషయాన్ని ది కీ మ్యాన్‌: ది ట్రూ స్టోరీ ఆఫ్‌ హౌ ది గ్లోబల్‌ ఎలైట్‌ వాజ్‌ డూప్డ్‌ బై ఎ క్యాపిటలిస్ట్‌ ఫెయిరీ టేల్‌ అనే పుస్తకంలో వివరించారు. గేట్స్ దానగుణాన్ని అలుసుగా తీసుకుని ఆరిఫ్‌ నఖ్వీ అనే పాకిస్థానీ వ్యాపారి 100 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.743 కోట్లు) భారీ మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు.

గేట్స్‌తోపాటు చాలా మంది వ్యాపార ప్రముఖులు ఆరిఫ్‌ ఉచ్చులో పడి మోసపోయినట్టు తెలిపారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వ్యాపారవేత్తగా మారిన నఖ్వీ.. 118 మిలియన్‌ డాలర్లతో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అబ్రాజ్‌ గ్రూప్‌ ను స్థాపించాడు. ఈ క్రమంలోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నట్టు నఖ్వీ ప్రకటించాడు. ఈ క్రమంలోనే 2010 ఏప్రిల్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశానికి ఆహ్వానం అందిన 250 మంది ముస్లిం వ్యాపారవేత్తల్లో ఈయన కూడా ఉన్నారు.

ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు, శిక్షణ, ఉపాధి కల్పన లాంటి అంశాలపై నఖ్వీ ప్రసంగించి ఆకట్టుకున్నాడు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత అమెరికా ప్రభుత్వం నఖ్వీకి చెందిన అబ్రాజ్‌ సంస్థలో 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. పలు వర్సిటీలకు కోట్ల రూపాయిల విరాళాలు ఇచ్చిన అతను, గేట్స్ ఫౌండేషన్ మాదిరే అమన్ ఫౌండేషన్ ను స్థాపించారు. 2017లో బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయటం కోసం న్యూయార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని.. పారిశ్రామికవేత్తలు హాజరు కావాలని కోరారు. ప్రపంచంలోని సంపన్నులు, బలమైన నేతల్ని కలిశాడు. అందులో బిల్ గేట్స్, క్లింటన్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.

నఖ్వీ చురుకుదనం నచ్చటంతో గేట్స్ తన ఫౌండేషన్ నుంచి 100 మిలియన్ డాలర్లను అందించారు. పాక్ లో జనాభా నియంత్రణకు తాను ప్రయత్నిస్తానని చెప్పటంతో ఈ భారీ మొత్తాన్ని నఖ్వీకి ఇచ్చారు. ఆ తర్వాత న్యూ అబ్రాజ్‌ గ్రోత్‌ మార్కెట్స్‌ హెల్త్‌ ఫండ్‌కు ఇతర మార్గాల ద్వారా 900 మిలియన్‌ డాలర్లు అందాయి. అయితే ఈ నిధులను దుర్వినియోగం చేయడం అప్పటికే ప్రారంభించిన నఖ్వీ , ఆడిట్ సమయంలో బ్యాంకుల్లో డబ్బులు చూపించి ఆ తర్వాత విత్‌డ్రా చేసేవారు.

అయితే, నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న వైనంపై అతడి కంపెనీలో పని చేసే ఉద్యోగి ఒకరు ఈ మొయిల్ రూపంలో అతని పెట్టుబడిదారులకు పంపటంతో అతడి బండారం బయటకు వచ్చింది. అబ్రాజ్‌ లెడ్జర్ ఖాతాలపై గేట్స్‌ ఫౌండేషన్‌ దర్యాప్తు చేయడంతో 660 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిదారులకు తెలియకుండా రహస్య ఖాతాలకు మళ్లినట్టు గుర్తించారు. మరో 385 మిలియన్‌ డాలర్లకు ఇప్పటికీ లెక్కలు లేవు. 2019 ఏప్రిల్‌ 10న లండన్‌ లోని హీత్రో ఎయిర్‌ పోర్ట్‌ లో నఖ్వీని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అతడిపై అవినీతి ఆరోపణలు రుజువైతే 291 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.