Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ అద్వానీల జోడీకి మోడీ అమిత్ షాల జోడీకి ఎంతో తేడా

By:  Tupaki Desk   |   29 Aug 2022 11:30 AM GMT
వాజ్ పేయ్ అద్వానీల జోడీకి మోడీ అమిత్ షాల జోడీకి ఎంతో తేడా
X
సంఘ్ పరివార్ తో వచ్చిన పార్టీ బీజేపీ. ఆరెస్సెస్ హిందూ వాదంతో వచ్చిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ విధానాలు జనాలకు నచ్చకపోవడంతో బీజేపీ జాతీయ స్థాయిలో రెండు సీట్ల నుంచి ఎదిగి ఈ రోజున దేశాన్ని శాసిస్తోంది. అయితే బీజేపీ పోకడల మీద ఆ పార్టీ ప్రస్థానం మీద ఇపుడు మేధావులు పెద్ద ఎత్తున విశ్లేషణ చేస్తున్నారు. ఇక బీజేపీలోఆనాటి ఈనాటి  నాయకత్వాలు వాటి మధ్యలో వచ్చిన తేడాను కూడా గమనిస్తున్నారు. అలా కనుక చూసుకుంటే 2014 ముందు బీజేపీ 2014 తరువాత బీజేపీ అని ఒక విభజన రేఖ విధించి మరీ బీజేపీ తీరుని అధ్యయనం చేస్తున్నారు.

వాజ్ పేయ్ అద్వానీ జోడీ కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ ఇద్దరు నాయకులను మెచ్చుకుంటారు. ఇక లోక్ సభలో వారు మాట్లాడితే దేశమంతా ఆసక్తిగా చూస్తారు, వింటారు. వాజ్ పేయ్ మాట్లాడితే అది ఒక గంగాప్రవాహం. ఆయన మాటలలో అనేక చలోక్తులు ఉంటాయి. వాటిని అలా వింటూ లోక్ సభ మొత్తం సైలెంట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన ప్రసంగానికి అలా  కట్టుబడిపోతుంది. వాజ్ పేయ్ గురించి చెప్పుకోవాలంటే కేవలం ఒకే ఒక ఓటు తేడా వచ్చి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆ రోజున ఆయన కనుక తలచుకుంటే కచ్చితంగా  ఒకటేమిటి పదుల ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడతాయి. ఆయన ప్రధాని పదవి కూడా నిలుస్తుంది. కానీ వాజ్ పేయ్ విలువలకు కట్టుబడ్డవారు. మనకొద్దీ పదవి అనుకున్నారు. జనంతోనే తేల్చుకుంటామని భావించారు. అందుకే 1999లో ఆయన తిరిగి ఎన్నికలకు వెళ్ళినపుడు ఎన్డీయే కూటమిని మంచి మెజారిటీని జనాలు కట్టబెట్టారు. అలా వాజ్ పేయ్ ఒక నీతివంతమైన విధానాన్ని దేశానికి ఆనాడు చూపించారు. బీజేపీ ఏలుబడి ఏంటో కూడా చాటి చెప్పారు.

ఇక అద్వానీ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన 1990 తరువాత బీజేపీని కొత్త పుంతలు తొక్కించారు. అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అపారం. అయినా సరే పార్టీ అధికారంలోకి వచ్చాక వాజ్ పేయ్ ని ప్రధానిని చేసి తాను డిప్యూటీగానే సర్దుకున్నారు. నాడే ఆయనకు పదవి మీద ఆశ ఉంటే గురు భావాన్ని సైతం పక్కన పెట్టేసి తానే సీటు ఎక్కేసేవారు. అలా కనుక చూస్తే అటు వాజ్ పేయ్ అయినా ఇటు అద్వానీ అయినా విలువలకు కట్టుబడ్డారు. వారిద్దరికీ గురు శిష్యుల బంధం. అన్న దమ్ముల బంధం. ఇద్దరు స్నేహితుల అద్భుత ప్రయాణం. అది దేశానికి బీజేపీకి కూడా మహత్తర సందేశాన్ని ఇచ్చింది.

మోడీ అమిత్ షా జోడీ ఈ ఇద్దరి జంట బీజేపీ సిద్ధాంతాలను, ఆరెస్సెస్ విధానాలను దాటి ముందుకు వచ్చేసింది అన్నది నిష్టూరమైనా కూడా నిజమైన విశ్లేషణ. ఈ జోడీకి పవర్ పాలిటిక్స్ అంటేనే ఇష్టం. ఇక సీబీఐ, ఈడీ జంట అలయెన్స్ తో వారు దేశాన్ని ఏలుతున్నారు అనే భావన అంతటా ఉంది. ఇక 2014 ఎన్నికల ముందు ఈడీ కేసులు వందల సంఖ్యలో ఉంటే ఇపుడు అవి ఒక్కసారిగా వేల సంఖ్యలోకి ఎగబాకాయి అంటే ఈ జోడీ పుణ్యమే అని అంటున్నారు.

ఇక ఈ ఇద్దరి జంట ఏలుబడిలో దేశ సంపద పది లక్షల కోట్లు అప్పనంగా కార్పోరేట్ శక్తులకు పంచేశారు అని కూడా చెబుతారు. అంతే కాదు గత ఎనిమిదేళ్లలో దేశం చేసిన అప్పులు మొత్తం డెబ్బై ఏళ్ల పాలన ముందు చేసిన అప్పుల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఈ అప్పులనుఏ రోజుకైనా  ఈ దేశం తీర్చగలదా అన్నది అతి పెద్ద ప్రశ్న.

ఇక రాజకీయంగా చూస్తే బీజేపీ మునుపెన్నడూ లేని దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది అని అంతా అంటున్నారు. దానికి కారణం ఈ జోడీ అధికారం కోసం పన్నే వ్యూహాలే అని చెబుతారు. విపక్ష పార్టీల  ఎమ్మెల్యేలను చీల్చడం,  వారిని ఎలా తమ పార్టీలో చేర్చుకోవాలో అన్నదే ఈ జోడీకి తెలిసిన సిద్ధాంతం అని కూడా అంటారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ రోజున  ఉంటాయో ఊడతాయో తెలియని రాజకీయ  అనిశ్చితికి బీజేపీ ఏలుబడిలో అనుసరిస్తున్న విధానాలే కారణం అని అంతా అంటున్నారు.

ఒక విధంగా చూస్తే తేడా కలిగిన పార్టీ అని బీజేపీని చెప్పుకుంటారు. కానీ ఆ తేడా అన్నది వాజ్ పేయ్ అద్వానీ జోడీకి, మోడీ షా ల జోడీకి మధ్యన చాలా ఎక్కువగానే కనిపిస్తోంది అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు అంటే బీజేపీ తాను ఏం సాధించింది, ఏమి పోగొట్టుకుంది అన్నది తెలుస్తోందిగా అని అంటున్నారు. సిద్ధాంతాలను ఫణంగా పెడితే అధికారం దక్కవచ్చు. కానీ అది తాత్కాలికం, అయితే  సిద్ధాంతాలను  పోయినవి మళ్లీ సాధించడం కష్టం. అపుడు పార్టీ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతుంది. ఈ సత్యం బీజేపీలో ఉన్న వారికి అర్ధమయ్యేసరికి కాషాయ రెపరెపలు ఇలాగే ఉంటాయా. అదే పెద్ద డౌట్ మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.