Begin typing your search above and press return to search.

కేంద్రంపై ప‌హ్లానీ షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   19 Aug 2017 5:43 PM GMT
కేంద్రంపై ప‌హ్లానీ షాకింగ్ కామెంట్స్‌!
X
కొంత కాలంగా సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ (సీబీఎఫ్ సీ) మాజీ ఛైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీ పేరు వార్త‌ల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయ‌న ప‌ద‌విలోకి వ‌చ్చాక సెన్సార్ క‌త్తెర‌కు ప‌దును పెరిగింద‌ని ఆయ‌న‌పై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉడ్తా పంజాబ్ నుంచి మొద‌లుకొని తాజాగా బాబూ మోషాయ్ బందూక్ బాజ్ వ‌ర‌కూ చాలా చిత్రాలకు లెక్క‌కు మించిన క‌ట్ లు వ‌చ్చాయి. అయితే, ప‌హ్లానీని ప‌ద‌వి నుంచి హ‌ఠాత్తుగా తొల‌గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 11న ఆయ‌న స్థానంలో కొత్త ఛైర్మ‌న్ గా ప్ర‌సూన్ జోషీని కేంద్రం నియ‌మించింది. ప్ర‌సూన్‌ విధుల్లో చేరే వ‌ర‌కు త‌న‌ను తొల‌గించిన విష‌యం చెప్ప‌లేద‌ని నిహ్లానీ వెల్ల‌డించారు. త‌న‌పై క‌క్ష సాధించేందుకు ప‌ద‌వి లోనుంచి తొల‌గించార‌ని ఆయ‌న ఆరోపించారు. కొన్ని సినిమాల సెన్సార్ ల విష‌యంలో విభేదాల వ‌ల్లే త‌న‌పై వేటు వేశార‌ని చెప్పారు. కేంద్ర మంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమ‌ర్జ‌న్సీ స‌మ‌యంలో ప‌రిణామాలు, సంజ‌య్ గాంధీ వ్య‌వ‌హార‌శైలిపై తెర‌కెక్కిన చిత్రం `ఇందూ స‌ర్కార్‌` . ఆ సినిమా విష‌యంలో వ‌చ్చిన విబేధాల వ‌ల్లే త‌నను ప‌ద‌వీచ్యుతుడిని చేశార‌ని నిహ్లానీ తెలిపారు. ఆ సినిమాకు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌కపోవ‌డంపై స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ త‌న‌కు ఫోన్ చేశార‌ని ఆయ‌న చెప్పారు.

అలాగే `భ‌జ‌రంగీ భాయ్‌ జాన్‌` వంటి కొన్ని సినిమాల విష‌యంలో మంత్రిత్వ శాఖే స‌ర్టిఫికెట్ జారీని జాప్యం చేయాల‌ని ఆదేశించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ప‌హ్లాజ్ సీబీఎఫ్‌సీ చైర్మ‌న్‌ గా ఉన్న‌పుడు చాలా సినిమాల విష‌యంలో క‌రుకుగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరుంది. చాలా సినిమాల్లో కీల‌క‌మైన‌ సీన్ల‌కు క‌త్తెర వేయ‌డం ఆ సినిమాల విజ‌యంపై ప్ర‌భావం చూపింద‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. అయితే, కొత్త‌గా వ‌చ్చిన సీబీఎఫ్‌ సీ చైర్మ‌న్ ప్రసూన్ జోషి కూడా ప‌హ్లానీ బాట‌లో ప‌య‌నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ చిత్రానికి ఏకంగా 73 క‌ట్లు చెప్పి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ప‌హ్లానీ క‌త్తెర క‌న్నా ప్ర‌సూన్ క‌త్తెర‌కు పదునెక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదే దూకుడును ప్ర‌సూన్ కొన‌సాగిస్తారో లేక నొప్పించ‌క తానొప్ప‌క అన్న రీతిలో వెళ‌తారో వేచి చూడాలి.