Begin typing your search above and press return to search.

ఆగిన పాదయాత్ర... ప్రారంభమైన రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి!

By:  Tupaki Desk   |   27 Oct 2022 12:12 PM IST
ఆగిన పాదయాత్ర... ప్రారంభమైన రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి!
X
రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య రోడ్‌ కం రైలు వంతెనపై మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జికి అత్యవసర పనులు చేయాలంటూ అక్టోబర్‌ 14 నుంచి ప్రయాణాలు నిషేధిస్తూ కలెక్టరు కె.మాధవీలత ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. అయితే 13 రోజుల అనంతరం అక్టోబర్‌ 27 నుంచి రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిని పునఃప్రారంభిస్తూ ఆదేశాలిచ్చారు.

భారీ వాహనాలను వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే శాఖ పనులు చేయాల్సి ఉన్నందున సాధారణ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు.

ఎంతో ప్రాధాన్యం గల బ్రిడ్జిపై మళ్లీ రాకపోకలకు అనుమతించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రోడ్డు కం రైలు వంతెనపై మరమ్మతులు తూతూమంత్రంగా చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నాలుగు అతుకులు, ఇనుప గ్రిల్స్, పలుచోట్ల ఫుట్‌పాత్‌ పనులతో ఏదో మమ అనిపించినట్టు చేశారని అంటున్నారు. రూ.కోటి నిధులతో కేంద్ర బృందంతో ఈ పనులను శాశ్వత ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని ముందుగా ప్రకటించారు. అయితే ఆ దిశగా పనులు జరగలేదని ప్రజలు అంటున్నారు.

ఈ వంతెనపై కొవ్వూరు – రాజమహేంద్రవరం మధ్య అయిదు కిలోమీటర్లు మాత్రమే. ఈ మార్గంలో రాకపోకలు ఆపేసి ట్రాఫిక్‌ మళ్లించడంతో సుమారు 20 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ఈ వంతెనపై నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా రాకపోకలు నిలిపివేశారని.. రాకపోకలు ఆపేసినప్పుడే విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూతూమంత్రంగా చేసిన ఈ మాత్రం పనులకు అంత హడావుడి అవసరమా..? అని ప్రజలు నిలదీస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.