Begin typing your search above and press return to search.

మన పద్మాలను పక్కింట్లోళ్లు పట్టించుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   26 Jan 2022 5:00 AM GMT
మన పద్మాలను పక్కింట్లోళ్లు పట్టించుకోవాల్సిందేనా?
X
నిజంగా ఇంతకు మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది చెప్పండి? ప్రతిభకు ఢోకా లేనోళ్లు ఉన్నా.. వారిని గుర్తించి కేంద్రానికి సిఫార్సు చేసే విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించే నిర్లక్ష్యం షాకింగ్ గా మారుతూ ఉంటుంది. మనోళ్ల టాలెంట్ ను మనం గుర్తించక.. దాన్ని పక్కింటోళ్లు గుర్తించి.. మనం చేయలేని పనుల్ని పక్కింటి వారితో చేయించే ధోరణి ఎంత త్వరగా మారితే అంత మంచిది.

తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్ని చూస్తే.. ఆ జాబితాలో 128 మంది ఉంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్క ప్రముఖుడు కూడా పద్మ పురస్కారానికి అర్హత లభించకపోవటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇక.. జాబితాను నిశితంగా చూస్తే.. ఈసారి తెలుగు సినిమాకు సంబంధించిన సీనియర్ నటి షావుకారి జానకికి పద్మశ్రీ పురస్కారం వరించింది. అయితే.. ఈ పురస్కారం రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలతో పాకుండా.. పక్కనున్న తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో ఆమె పురస్కారాన్నిసొంతం చేసుకోవటం చూస్తే.. మనోళ్ల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

మన పట్టించుకోని మన ఇంటి పద్మాలను పక్కింటి వారు పట్టుకొని వారిని పురస్కార గ్రహీతలుగా మారేలా చేయటంలో కీలక భూమిక పోషిస్తుంటారు. ఈ తీరు ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదని చెబుతారు. ఇప్పుడు అవార్డు వచ్చిన షావుకారుజానకిని పక్కన పెట్టి.. సీనియర్ నటులు ఎవరెవరు ఉన్నారు? వారికి వచ్చిన పురస్కారాలు మొత్తం కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల కంటే కూడా పక్కనున్న రాష్ట్రాల వారు వీరి ప్రతిభను గుర్తిస్తుండటం విశేషం.

ఎవరి దాకానో ఎందుకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి..తాను తీసిన బాహుబలి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన ఆయనకు పద్మ పురస్కారం పక్కనున్న కర్ణాటక వాళ్లు సిఫార్సు చేయాల్సి వచ్చింది. తెలుగు సెలబ్రిటీలను.. కళాకారుల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తిస్తారా? లేదంటే.. పాత తప్పుల్ని అదే పనిగా కంటిన్యూ చేస్తారా? అన్నది చూడాలి.

స్వర్గీయ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు తమిళనాడు కోటాలో తెలుగు వారికి అవార్డులు లభించాయి. పక్కనున్న తమిళనాడుప్రభుత్వం చొరవ చూపించగా లేనిది.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ పని ఎందుకు చేయరు? అన్నది ప్రశ్న. చెన్నై నుంచి చిత్రపరిశ్రమను హైదరాబాద్ ను తరలించే విషయంలో తెలుగు ప్రభుత్వాలు చూపించిన చొరవ.. మన వాళ్లను మనం గుర్తించి.. వారికి పురస్కారం లభించేలా మన ముఖ్యమంత్రులు ఎందుకు చేయకూడదు? మన పద్మాల్ని మనమే విరిసేలా చేసుకోలేమా? పక్కింటోళ్లు నీళ్లు పోసి.. ఎరువు వేయాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కళ్లు తెరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.