Begin typing your search above and press return to search.

పద్మనాభస్వామి ఆలయం పై సుప్రీం కీలక తీర్పు !

By:  Tupaki Desk   |   13 July 2020 10:10 AM GMT
పద్మనాభస్వామి ఆలయం పై సుప్రీం కీలక తీర్పు !
X
ఈ సువిశాలమైన భారతావనిలో అంత్యంత ధనిక ఆలయం గా గుర్తింపు పొందిన అనంత పద్మనాభ స్వామి ఆలయం భాద్యతలు ట్రావెన్‌ కోర్ రాజ కుటుంబానికే అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ వంశాని కే కట్టబెడుతూ .. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. అలాగే , త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా నియమిస్తున్నట్టు , ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా ఉంటుందని స్పష్టం చేసింది.

కేరళలో ఉన్న ఈ ఆలయానికి గతంలో అంతగా ప్రాముఖ్యత లేదు. కానీ , 2011లో ఒక్కసారిగా ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలోని రహస్య తలుపులను తెరవగా అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ గుడి ఒక్కసారిగా దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. ఆ ఆలయంలో ఉన్న అన్ని తలపులు తెరచినా కూడా ఒక నేలమాళిగను మాత్రం తెరవలేదు. ఆ గదిని తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు వాదిస్తున్నారు. ఆ నేలమాళిగకు నాగబంధం ఉండటంతో అది తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు.

ఇక 2011 లో అనంతమైన సంపద ఆ ఆలయంలో బయటపడిన తరువాత కొంత మంది కేరళ హైకోర్టుకు వెళ్లారు. ఆలయంపై ట్రావెన్‌ కోర్ రాజుకుటుంబ పెత్తనాన్ని నిషేధించాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ..1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు ముగిసిపోయాయని తీర్పు వెలువరించింది. అయితే , ఆ తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌ కోర్ రాజ వంశస్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు.. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని తెలిపింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది, దీనితో ఆ ఆలయంలోని ఆరో నేలమాళిగని తెరవాలా , వద్దా అనే దాని పై ఆ రాజ వంశీయులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు తెరచిన ఐదు నేలమాళిగల్లో సుమారు ఐదు లక్షల కోట్ల సంపద ఉంటుందని అంచనా వేశారు.