Begin typing your search above and press return to search.

జైల్లో ఒంట‌రిగా ప‌ద్మ‌జ‌.. అదే మాన‌సిక స్థితి.. ఈ ఘ‌ట‌న నేర్పుతున్న పాఠాలెన్నో..!

By:  Tupaki Desk   |   27 Jan 2021 10:36 AM GMT
జైల్లో ఒంట‌రిగా ప‌ద్మ‌జ‌.. అదే మాన‌సిక స్థితి.. ఈ ఘ‌ట‌న నేర్పుతున్న పాఠాలెన్నో..!
X
మ‌ద‌న‌ప‌ల్లెలో మూఢ విశ్వాసాల‌తో చేజేతులా పిల్ల‌ల్ని బలిగొన్న లెక్చ‌ర‌ర్ పురుషోత్త‌మ్ నాయుడు, ఆయ‌న భార్య ప‌ద్మ‌జను కోర్టు విచార‌ణ అనంత‌రం జైలుకు త‌ర‌లించారు. వీరికి న్యాయ‌స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే.. కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు వ‌ర‌కూ ఇద్ద‌రినీ వారి ఇంట్లోనే ఉంచి విచారించారు పోలీసులు. ఆ విచార‌ణ‌లో విస్మ‌య‌ప‌రిచే విష‌యాలు వెలుగు చూశాయి. వారి మూఢత్వం ఏ స్థాయిలో తెలుసుకొని పోలీసులు దిగ్భ్రాంతికి లోన‌య్యారు.

దెయ్యం పోవాలంటే చంపాల్సిందే..
చిన్న కూతురు దివ్య‌కు దెయ్యం ప‌ట్టింద‌ని ఆమె త‌ల్లి, పెద్ద కూతురు బలంగా న‌మ్మారు. తండ్రి కూడా వారి ప్ర‌భావానికి లోన‌య్యాడు. దెయ్యాన్ని వ‌దిలించాలంటూ ప‌లు ప్ర‌య‌త్నాలు చేసిన వారంతా.. చిన్న కూతురును చంప‌డమే మార్గ‌మ‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఇంట్లో విచిత్ర‌మైన పూజ‌లు చేసి ముందుగా చిన్న‌మ్మాయిని చంపారు. ఆ త‌ర్వాత త‌న‌ను చంపాలంటూ పెద్ద కూతురు త‌ల్లిదండ్రుల‌ను ఆదేశించిందని పురుషోత్తం పోలీసులకు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇంకా ట్రాన్స్ లోనే త‌ల్లి..
త‌ల్లి ప‌ద్మ‌జ మాత్రం పోలీసుల విచార‌ణ‌కు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేదు. మంగళవారం ఆమెను ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న‌ప్పుడే రానంటూ మొండికేశారు. 'ఐ యామ్‌ నాట్ తీఫ్‌. ఐ యామ్‌ లార్డ్ శివ. నన్నెందుకు స్టేషన్‌కు రమ్మంటున్నారు' అంటూ ప్రశ్నించింది. క‌రోనా టెస్ట్ చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తే.. 'నా కేశాల నుంచే క‌రోనా పుట్టింది. నాకెందుకు ప‌రీక్ష‌?' అని వాదించింది. ఎలాగోలా స్టేషన్‌కు తీసుకొచ్చాక..స్టేషన్‌లో అరుపులు, కేకలు పెట్టింది పద్మజ. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ ఆమెను విచారించబోగా.. ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఆమె భ‌ర్త‌ పురుషోత్తమ నాయుడిని విచారించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు పోలీసులు.

నా బిడ్డలు బతికే ఉన్నారు..
'నా బిడ్డలు చనిపోయారని మీరు అనుకుంటున్నారు. కానీ.. వారు బతికే ఉన్నారు. అలేఖ్య రెండుమూడు రోజుల్లో తిరిగి వస్తుంది. నాకు కలలో కూడా చెప్పింది. మీరే మా ఇంటికి వచ్చి పూజలు అపవిత్రం చేశారు. మధ్యలో ఆపేశారు, అందుకే నా బిడ్డలు నాకు దక్కకుండా పోయారు..ఈ పాపం మీదే'అంటూ గోల చేసింది ప‌ద్మ‌జ‌. ఆదివారం హ‌త్య‌ల త‌ర్వాత వారికి ఇంటికెళ్లిన పోలీసులతో ప్రాధేయపడుతూ మాట్లాడిన పద్మజ.. రెండు రోజుల త‌ర్వాత ఇలా.. అనూహ్యమైన మార్పుతో మాట్లాడుతుండ‌డంతో పోలీసులు, ఇటు వైద్యులు విస్మ‌యానికి గురయ్యారు.

జైలులో ప్ర‌త్యేక గ‌ది..
అలౌకిక స్థితిలో ఉండి.. తీవ్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ప‌ద్మ‌జను జైలులో ప్ర‌త్యేక గ‌దిలో ఉంచారు పోలీసులు. ఇత‌రుల‌కు ఏమైనా ఇబ్బంది క‌లిగిస్తుందేమోన‌ని స్పెష‌ల్ సెల్ లో ఉంచారు. పురుషోత్తం నాయుడిని మాత్రం సాధార‌ణ రిమాండ్ ఖైదీల‌తో ఉంచిన‌ట్టుగా పోలీసులు తెలిపారు. కాగా.. వీరి ప‌రిస్థితిపై మాన‌సిక వైద్యులు స్పందిస్తూ.. భార్యాభ‌ర్త‌లు సాధార‌ణ ఆధ్యాత్మిక‌త‌కు మించి ఒక ట్రాన్స్ లోకి వెళ్లార‌ని, వారికి స‌రైన చికిత్స అందించ‌డం ద్వారా మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి తీసుకురావొచ్చ‌ని చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న నేర్పుతున్న పాఠాలెన్నో..
ఒక దొంగ‌కు ఎక్కువ శిక్ష విధించాలా? ఒక హంత‌కుడికా? అంటే.. ఎవ‌రైనా హంత‌కుడికే అంటారు. ఎందుకంటే.. దొంగ‌త‌నం చిన్న నేరం.. ప్రాణాలు తీయ‌డం పెద్ద నేరం అని మ‌నం భావిస్తాం. కానీ.. న్యాయ‌స్థానం అలా ఆలోచించ‌దు. ల‌భించిన సాక్ష్యాలు, ఆధారాల‌తోపాటు నేర‌స్థుడి ప్ర‌వ‌ర్త‌నను.. ఆలోచ‌నా విధానాన్ని.. గ‌త నేర చ‌రిత్ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. ఆ లెక్క ప్ర‌కారం క్ష‌ణికావేశంలో చేసిన హ‌త్య‌కంటే.. ప‌క్కా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో చేసిన ఆర్థిక నేరానికి ఎక్కువ శిక్ష విధించే అవ‌కాశం కూడా ఉంటుంది. దీని ప్ర‌కారం.. మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన హ‌త్య‌లు క్ష‌ణికావేశంలో జ‌రిగిన‌వి కావు. సొంత కూతుళ్ల‌ను బ‌లిచ్చే స్టేజ్ కు త‌ల్లిదండ్రులు వెళ్లారంటే.. వాళ్ల‌పై ఈ మూఢ విశ్వాసాలపై దీర్ఘ‌కాల ప్ర‌భావం ఉంద‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది. అయితే.. వీరికి న్యాయ‌స్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలియ‌దుగానీ.. స‌మాజం ఎలాంటి మూఢ‌త్వంలో ఉందో.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతమేర ఉందో.. అనే పాఠాల‌ను నేర్పుతోందీ ఘ‌ట‌న‌.

అత్యున్న‌త విద్యావంతులైనప్ప‌టికీ..
చ‌నిపోయిన ఇద్ద‌రు అమ్మాయిలు.. చంపిన త‌ల్లిదండ్రులు.. మొత్తం న‌లుగురూ అత్యున్న‌త విద్యావంతులే. అయిన‌ప్ప‌టికీ.. వారు మూఢ న‌మ్మ‌కాల‌ను ఇంత బ‌లంగా విశ్వ‌సించ‌డం దిగ్భ్రాంతి క‌లిగించే విష‌యం. తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే పూర్తిగా మూఢ విశ్వాసాల‌కు బందీ అయిన పెద్ద కూతురు.. ఆ త‌ర్వాత చెల్లిని భ‌య‌పెట్టి త‌న‌వైపు లాక్కోవ‌డం.. ఆ త‌ర్వాత తల్లిదండ్రులు కూడా మూఢ‌త్వపు అగాథంలోకి జారిపోవ‌డం.. తుద‌కు క‌న్న‌బిడ్డ‌ల‌ను క‌ర్క‌శంగా మూఢ న‌మ్మాల‌కు బ‌లివ్వ‌డం అనేది జీర్ణించుకోలేని అంశం. చ‌దువులో ఎన్ని డిగ్రీలు సంపాదించినా.. మూఢ‌త్వాన్ని వ‌దిలి పెట్ట‌క‌పోతే, విజ్ఞానాన్ని అందుకోలేక‌పోతే జ‌రిగే దారుణాలు ఎలా ఉంటాయో ఈ ఘ‌ట‌న హెచ్చ‌రిస్తోంది.

ఇలాంటి వారు ఎంద‌రో..?
పిల్ల‌ల్ని చంపుకునే స్థాయిలో మూఢ‌త్వాన్ని ఆచ‌రించేవారు ఉండ‌క‌పోవ‌చ్చేమోగానీ.. మూఢ‌త్వంలో నిత్యం మునిగితేలుతున్న వారికి మాత్రం ఈ దేశంలో కొద‌వ‌లేదు. ఆ విష‌యాన్ని బాబాల ఆశ్ర‌మాలెన్నో చాటి చెప్తుంటాయి. ప‌లానా విష‌యం ఎలా జ‌రుగుతుంది? ఎలా సాధ్య‌మ‌వుతుంది? ఆధారం ఏంటీ? అనే క‌నీస ఆలోచ‌న చేయ‌కుండా.. బాబాలు, స్వాములు ఇత‌ర‌త్రా గార‌డీమోస‌గాళ్లు చెప్పే మాట‌ల‌ను గుడ్డిగా న‌మ్మేవారికి లెక్కేలేదు. ఉప‌వాసాల‌తో మొద‌లు పెట్టి.. ఇల్లిల్లూ తిరిగి ప్ర‌సాదాలు పంచి పెట్టే వారు ఎంద‌రో.

ఉన్మాదంగా మారితే..
భ‌క్తి తార‌స్థాయికి చేరి, అది ఉన్మాదంగా మారిన వారు ఈ ప‌ద్మ‌జ‌, పురుషోత్తం నాయుడి కుటుంబంలా మారిపోతారు. ఇలాంటి వారు.. త‌మ అతి భ‌క్తిని ప్ర‌శ్నిస్తే అస్స‌లు త‌ట్టుకోలేరు. అయితే.. వీరంతా ప‌రుషోత్త‌మ్ నాయుడు, ప‌ద్మ‌జ దంపతుల్లా దారుణాల‌కు తెగ‌బ‌డాతార‌ని చెప్ప‌లేం. కానీ.. మూఢ‌త్వం ఆలోచ‌న‌ను చంపేస్తుంది. హేతుబ‌ద్ధ‌త‌ను ద‌గ్గ‌రికి రానివ్వ‌దు. నిజానిజాల‌ను విశ్లేషించ‌నివ్వ‌దు. కేవ‌లం చెప్పింది చేసుకుపోవ‌డం మాత్ర‌మే దానిప‌ని. అందుకే.. మూఢ‌త్వంలో మునిగితేలే వారు దుస్తులు విప్ప‌డం ద‌గ్గ‌ర్నుంచి చివ‌ర‌కు ప్రాణాలు పోగొట్టుకోవ‌డం వ‌ర‌కూ సిద్ధ‌ప‌డ‌తారు. అయితే.. ఈ అతి విశ్వాసం కూడా ఒక్కొక్క‌రిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. దేవుడిపై భ‌క్తి అనేది వాస్త‌వాల ఆధారంగా ఉంటే మంచిదే కానీ.. అతిగా ప‌రిణ‌మించిన‌ప్పుడు.. ఇలాంటి ఘోరాలు.. దారుణాలు సంభ‌విస్తుంటాయి.