Begin typing your search above and press return to search.

టైమ్స్ ఆఫ్ ఇండియాపై రామోజీ పైచేయి

By:  Tupaki Desk   |   26 Jan 2016 7:23 AM GMT
టైమ్స్ ఆఫ్ ఇండియాపై రామోజీ పైచేయి
X
రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించడం... మీడియా మొఘల్ రామోజీరావుకు పద్మ విభూషణ్ వరించడం తెలిసిందే. అయితే... దేశంలోని మరో మీడియా సంస్థకు చెందిన వ్యక్తికీ... ఇంకా చెప్పాలంటే రామోజీరావుకు చెందిన ఈనాడు కంటే పెద్ద పత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ కు కూడా పద్మ పురస్కారం వరించింది. విశేషమేంటంటే... రామోజీరావుకు పద్మ విభూషణ్ లభించగా టైమ్స్ ఛైర్మన్ ఇందూ జైన్ కు పద్మభూషణ్ మాత్రమే దక్కింది. సామాజిక సేవా కార్యాక్రమాలు భారీగా చేపడుతున్నందున ఇందూజైన్ కు పద్మభూషణ్ రాగా సాహిత్యం-విద్య, జర్నలిజం అన్న కేటగిరీలో రామోజీరావుకు పద్మ విభూషణ్ ప్రకటించారు. మొత్తానికి దేశంలోని ఇద్దరు మీడియా టైకూన్లకు ఒకే సారి పద్మ పురస్కారాలు లభించడం విశేషమే మరి.

అయితే... దేశవ్యాప్తంగా సర్క్యులేషన్ ఉన్న పత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా అధిపతి కంటే ఈనాడు అధిపతికి పెద్ద పురస్కారం లభించడం ఆసక్తికరంగా మారింది. జాతీయ మీడియాలో తనకంటూ ప్రత్యేకత చూపించుకున్న టైమ్స్‌ గ్రూప్‌ ఇప్పటికే ప్రాంతీయ భాషలపై కన్నేసింది. ప్రాంతీయ భాషల్లో అందులోనూ... ఈనాడు వంటి అగ్రశ్రేణి ప్రాంతీయ భాషా పత్రికను దెబ్బకొట్టి తాను ఎదగాలని భావిస్తున్న టైమ్స్ అందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతుంటారు. ఇప్పటికే టైమ్స్ గ్రూప్ ప్రాంతీయ భాషల్లో వార్తలు అందించేందుకు వెబ్ సైట్లు పెట్టింది. భవిష్యత్తులో తెలుగులో పత్రికనూ ప్రారంభించే అవకాశాలున్నాయని మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో టైమ్స్ ను ఎప్పటికైనా తనకు ప్రత్యర్థే అని ఈనాడు కూడా భావిస్తుంటుంది. అలాంటి నేపథ్యంలో టైమ్స్ అధిపతి కంటే పెద్ద అవార్డు అందుకుని రామోజీ వారిపై మానసికంగా పైచేయి సాధించారని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

మీడియా బిజినెస్ పరంగా తమకు పోటీగా వచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లో టైమ్స్ గ్రూప్ ప్లాట్ ఫాం వేసుకుంటుండడంతో రామోజీ వారితో పోటీకి, యుద్ధానికి రెడీ అవుతున్నట్లుగానూ కొందరు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇందూజైన్ కు పద్మభూషణ్ ఇవ్వనున్నారని తెలిసే ఎప్పుడూ లేనిది తాను పద్మవిభూషణ్ కు ప్రపోజ్ చేయించుకున్నారని చెబుతున్నారు. ఇద్దరు మీడియా జైంట్లకు వచ్చిన ఈ పద్మ అవార్డులు కాకతాళీయమో లేదంటే ఇందులో పోటీ ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఇది ఆసక్తికరంగా మారింది.