Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌లో లేడీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ జంట్ ఎమ్మెల్సీ

By:  Tupaki Desk   |   18 Aug 2019 9:43 AM GMT
టీఆర్ఎస్‌లో లేడీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ జంట్ ఎమ్మెల్సీ
X
మెద‌క్ జిల్లా టీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరుకుంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధంతో స‌రిపుచ్చిన ఆ నేత‌లిద్ద‌రూ నేడు అనుచ‌రుల వ‌ద్ద మ‌నం ఎంత మాత్రం త‌గ్గేది లేదని వ్యాఖ్య‌నిస్తూ రాజ‌కీయ వేడి పెంచుతుండ‌టం గ‌మ‌నార్హం. మొన్నటి వరకు శంకుస్థాపనలు - ప్రారంభోత్సవాలు - పార్టీ - ప్రభుత్వ కార్యక్రమాలపై వీరిమధ్య పరోక్ష ఆధిపత్య పోరు సాగింది. ఇప్పుడు జలహారతి పై రగడ ముదిరి పాకాన పడ్డంతో, ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. నిత్యం సీఎంను అంటి పెట్టుకుని ఉండే ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి - ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది.

ప‌ద్మా దేవేంద‌ర్‌ రెడ్డి మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప‌నిచేస్తున్న సుభాష్‌ రెడ్డి స్వ‌గ్రామం మెదక్ నియోజక వర్గంలోని కూచన్‌పల్లి. దీంతో ఇద్ద‌రు నేత‌లు ఈ ప్రాంతంపై ప‌ట్టు ఏమాత్రం స‌డ‌ల‌కూడ‌దు అన్న దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన వీరు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల్సి ఉన్నా ఆధిప‌త్యం కోసం ఆరాట‌ప‌డుతున్నారు. త‌మ ఆధిప‌త్యాన్ని చాటుకునేందుకు ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ప్ర‌తి ప‌ని విష‌యంలో వీరు ఆధిప‌త్య పోరుకు తెర‌దీస్తున్నారు.

కూచన్‌పల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు సీఎం సహకారంతో, కూచన్‌పల్లి గ్రామంలో గతేడాది రూ.15 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించారు శేరి సుభాష్‌రెడ్డి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చెక్ డ్యామ్ పూర్తిగా నిండింది. చుట్టూ పక్కల గ్రామాల్లో ఎండి పోయిన బోర్లలో సైతం తిరిగి నీళ్లు రావడం ప్రారంభమైంది. అయితే చెక్‌డ్యాం ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సుభాష్‌రెడ్డి భావించాడ‌ట‌. అయితే ఈ విష‌యం తెలుసుకున్న ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి సుభాష్‌రెడ్డికి మాట‌మాత్రంగానైనా చెప్ప‌కుండా కొంత‌మంది కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి చెక్ డ్యాంకు వెళ్లి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి వెళ్లారట‌.

తన స్వంత గ్రామంలో, తను నిర్మించిన చెక్ డ్యామ్ వద్ద, తనకు తెలియకుండా పూజాలేమిటని సుభాష్ రెడ్డి అసహనంతో రగిలిపోయారట. సుభాష్‌రెడ్డి విష‌యం తెలుసుకున్న ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని, చిన్న విష‌య‌మ‌ని లైట్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. చివరకు చేసేదేమిలేక మూడు రోజుల తర్వాత తన స్వగ్రామం కూచన్‌పల్లికి వెళ్లి చెక్ డ్యామ్ వద్ద ఘనంగా జల హారతి నిర్వహించారట ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డి. ఈ విష‌యాన్ని సీఎం వ‌ర‌కు తీసుకెళ్లి ఆమెను కొంచెం అదుపు చేయాల‌ని ఆయ‌న అనుచ‌రులు ఒత్తిడి తెస్తున్నార‌ట‌. మ‌రి వీరిద్ద‌రి ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ఫుల్‌స్టాప్ ప‌డుతుందా ? క‌ంటిన్యూ అవుతుందా ? చూడాలి.