Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి హోదాలో పాదయాత్ర

By:  Tupaki Desk   |   16 Aug 2021 9:30 AM GMT
కేంద్రమంత్రి హోదాలో పాదయాత్ర
X
కేంద్ర మంత్రి హోదాలో పాదయాత్ర చేయబోతున్న మొదటి వ్యక్తి జీ కిషన్ రెడ్డేనేమో. అధికారం కోసం లేకపోతే పార్టీలో తన ఆధిపత్యం కోసం పాదయాత్రలు చేసిన నేతలను చాలామందినే చూశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి క్లాసిక్ ఉదాహరణలు. అయితే అధికారంలో కూర్చున్న తర్వాత కూడా పాదయాత్రలు చేసిన నేతలు లేరనే చెప్పాలి. కానీ ఇందుకు భిన్నంగా కేంద్ర పర్యాటక శాఖమంత్రి జీ. కిషన్ రెడ్డి తొందరలో పాదయాత్ర చేయబోతున్నారు.

ఈనెల 19వ తేదీన నల్గొండ జిల్లాలోని కోదాడలో మొదలయ్యే పాదయాత్ర 21వ తేదీన హైదరాబాద్ లో జరిగే బహిరంగసభతో ముగియబోతోంది. పాదయాత్రకు ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేకపోయినా తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికను ఉద్దేశించే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికకు కిషన్ రెడ్డి పాదయాత్రకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యంగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలోని 12 జిల్లాల పరిధిలోని 7 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగేట్లుగా బీజేపీ నేతలు రూట్ మ్యాప్ రెడీ చేశారు. మొత్తం 324 కిలోమీటర్ల మేర కిషన్ పాదయాత్ర సాగనుంది. 19 సాయంత్రం 4 గంటలకు కోదాడలో మొదలవ్వనున్న కిషన్ రెడ్డి సూర్యాపేటలో రాత్రి బసచేస్తారు. తర్వాత వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్ చేరుకుని బహిరంగసభతో ముగిస్తారు.

తెలంగాణాలో ఇంతవరకు కమలనాదుల్లో ఎవరు పాదయాత్ర చేయలేదు. మొదటిసారి సుదీర్ఘపాదయాత్రకు పార్టీ చీఫ్ బండి సంజయే రెడీ అవుతున్నారు. ఇంతలోనే కేంద్రమంత్రి పాదయాత్రకు రెడీ అయిపోవటం గమనార్హం. పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు పార్టీలోని సీనియర్ నేతలంతా పాల్గొంటారనటంలో సందేహంలేదు. ఇదే స్పూర్తిని బండి కూడా కంటిన్యు చేసి తొందరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నిక వరకు క్యారీ చేయాలన్నది బీజేపీ నేతల వ్యూహంగా కనబడుతోంది. మరి కమలనాదుల పాదయాత్ర ఫలితమిస్తుందా ? చూడాల్సిందే.