Begin typing your search above and press return to search.

బాబు రివ్యూతో మాణిక్యానికి మంట పుట్టింది

By:  Tupaki Desk   |   23 May 2017 7:27 AM GMT
బాబు రివ్యూతో మాణిక్యానికి మంట పుట్టింది
X
సోమ‌వారం అన్న వెంట‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పోల‌వ‌రం ప్రాజెక్టు గుర్తుకు వ‌చ్చేస్తుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల లోపు ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేసేస్తే.. భారీ మైలేజీ సొంతం చేసుకోవాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా చెబుతారు. ఆలోచ‌న వ‌ర‌కూ బాగానే ఉన్నా.. దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసే విష‌యంలో పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ల‌కు అంత సీన్ లేద‌న్న విమ‌ర్శ ఉంది. ఒక టీవీ చాన‌ల్ అయితే.. పోల‌వ‌రం గుత్తేదారుల తీరుపై బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించేయ‌టం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే బాబు ప‌నులు చేయించ‌టం విశేషం. ఇదిలా ఉంటే.. ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టు పనుల్ని రివ్యూ చేయ‌టం.. అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం బాబుకు.. ఇటు అధికారుల‌కు ఒక అల‌వాటుగా మారింది. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో త‌ప్పించి మిగిలిన అన్ని స‌మ‌యాల్లోనూ వేలెత్తి చూపించిన ప‌రిస్థితే. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పులులేవ‌ని చెబుతారు.

నిన్న‌టికి నిన్న సోమ‌వారం పోల‌వ‌రం ప‌నుల్ని ప‌ర్య‌వేక్షించేందుకు చంద్ర‌బాబు పోల‌వ‌రంకు వెళ్లారు. మ‌ధ్యాహ్నం 11.40 గంట‌ల ప్రాంతంలో పోల‌వ‌రం ప్రాంతానికి వ‌చ్చి ప‌నుల్ని ప‌ర్య‌వేక్షించారు. ఓ ప‌క్క మంటలు పుట్టే ఎండ‌ తీవ్ర‌త ఉన్నా.. చంద్ర‌బాబు త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు. కానీ.. స‌మ‌స్య అంతా బాబును కంటికి రెప్పాలా చూసుకోవాల్సిన సెక్యూరిటీ సిబ్బందికి.. ఆయ‌న సెక్యూరిటీ పీఏ మాణిక్యంకు చుక్క‌లు క‌నిపించాయి.

తీవ్ర‌మైన ఎండ‌.. భారీ ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య రివ్యూను షురూ చేసిన బాబు దాదాపు గంట ప‌దినిమిషాలు అధికారుల‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ 70 నిమిషాల పాటు ముఖ్య‌మంత్రికి ఎండ పొడ అన్న‌ది త‌గ‌ల‌కుండా సీఎం సెక్యూరిటీ పీఏ మాణిక్యం ప‌డిన శ్ర‌మ అంతాఇంతా కాదు. మండే ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లొద్దంటూ ప్ర‌భుత్వం ఒక ప‌క్క‌న భారీగా ప్ర‌చారం చేస్తూనే.. త‌న సెక్యూరిటీకి ఎండ‌తో చుక్క‌లు చూపిస్తున్న బాబు తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఎండ పొడ త‌గ‌ల‌కుండా ఆయ‌న చుట్టూ ఉన్న వారు జాగ్ర‌త్త‌గా ఉంటార‌ని.. కానీ.. వారి ఆరోగ్యం గురించి.. ఎండ తీవ్ర‌త గురించి బాబు కాస్త ఆలోచిస్తే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.