ఏపీ రాజధానికి సంబంధించిన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకు పెద్ద చిక్కే వచ్చి పడింది. మొదటి దశలో మేళతాళాలతో స్వాగతం పలికి మరీ.. తమ భూమి దస్తావేజులు ప్రభుత్వానికి ఇచ్చేసిన ఏపీ రాజధాని ప్రాంతానికి చెందిన రైతులకు భిన్నంగా.. కొందరు అడ్డం తిరగటం ఏపీ సర్కారుకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది.
శంకుస్థాపనకు ముహుర్తం తరుముకొస్తున్న నేపథ్యంలో.. భూమిని సేకరించాల్సిన ఒత్తిడి ఏపీ ప్రభుత్వం మీద పడిపోతుంది. దీంతో.. భూసమీకరణ స్థానే.. భూసేకరణను సీన్ లోకి తెచ్చారు. దీనిపై విపక్షాలతోపాటు.. ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు పలికి పవన్ కల్యాణ్ సైతం వ్యతిరేకించటం అధికారపక్షానికి మింగుడు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి నారాయణపై ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది.
నిన్నమొన్నటి వరకూ భూసమీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రశంసలు పొందిన నారాయణకు.. తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకేనేమో.. రైతుల్ని ఆకట్టుకునేందుకు మంత్రినారాయణ కిందామీదా పడిపోతున్నారు. కొత్త కొత్త కాన్సెఫ్ట్ లు చెప్పి.. రైతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన రైతులతో మాట్లాడుతున్న తీరును పరిశీలిస్తే.. అచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఉండటం గమనార్హం. రాజధాని నేపథ్యంలో భూములు రేట్లు భారీగా పెరుగుతాయని.. రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుందని ఊరిస్తున్నారు.
భూముల రేట్లు ఎకరం కోటి నుంచి కోటిన్నర వరకు పెరిగిన విషయాన్ని ఉదహరిస్తూ.. ప్రభుత్వానికి భూములు ఇవ్వటం ద్వారా.. రాజధాని పనులు మొదలైతే.. ధర కూడా అంతే తొందరగా పెరుగుతుందని.. అందుకే భూములు ఇచ్చేందుకు సహకరించాలంటూ ఆయన సలహా ఇస్తున్నారు. 2019 నాటికి రాజధానిని పూర్తి చేయాలంటే భూములు ఇవ్వటం ఆలస్యం చేయకూడదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే.. ఇక్కడ సమస్యల్లా.. రాజధాని ప్రకటనకు ముందు నుంచి కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉన్నాయి. ఏపీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీ..అక్కడి భూములున్న వారికి నష్టం కలిగించేలా ఉండటంతో వారు తమ భూముల్ని ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే.. ఈ విషయాన్ని ఏపీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమస్యను పరిష్కారమయ్యేలా వ్యవహరిస్తే బాగుండేది. కానీ..అందుకు భిన్నంగా భూసమీకరణ కొరడాను తీయటంతో రైతుల్లో వ్యతిరేకత మొదలైన పరిస్థితి.
ఇలాంటి సమయంలో.. రియల్ ఎస్టేట్ లా మాట్లాడుతున్న మంత్రి నారాయణ.. రాజధాని పనులు వెంటనే పూర్తి అయిలే.. భూముల ధరలు పెరగటం ద్వారా.. రైతులు లాభ పడొచ్చని.. అందుకే రైతులు తమ భూముల్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నారు. ఎప్పుడో వచ్చే లాభం కోసం.. ఇప్పుడు నష్టానికి ఇవ్వటం ఏం లెక్క నారాయణ? ఎంత రైతులైతే మాత్రం వ్యాపారం తెలీదనుకుంటున్నారా ఏంటి..?