Begin typing your search above and press return to search.

కండోమ్ కొనాలన్నా.. ఆధార్ కావాలా ?

By:  Tupaki Desk   |   23 Dec 2017 9:31 AM GMT
కండోమ్ కొనాలన్నా.. ఆధార్ కావాలా ?
X
స‌ర్వం ఆధార్‌ మ‌యం అయిపోయినట్లుగా మారిపోయింది ప్ర‌స్తుత ప‌రిస్థితి. ఆఖ‌రికి గోవాలంటి రాష్ట్రంలో అయితే...అమ్మాయిల కోసం కూడా విటులు ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలి. ఈ నేప‌థ్యంలో మాజీ కేంద్ర మంత్రి చిందబరం ఆధార్‌ పై భారీ సెటైర్ వేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబ‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నింటితో ఆధార్‌ ను అనుసంధానం చేయాలని మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ఖండించారు.

ముంబై ఐఐటీలో జరిగిన మూడ్ ఇండిగో ఫెస్టివల్‌ కు హాజరైన ఆయన అక్కడ మాట్లాడుతూ ``ఓ యువతీ - యువకుడు హాలీడేకి వెళ్లాలనుకున్నారు. వాళ్లు పెళ్లి చేసుకోలేదు. అందులో తప్పు ఏముంది? ఒకవేళ ఆ యువకుడు కండోమ్ కొనాలనుకుంటే - అతను తన ఆధార్ వివరాలను ఎందుకు వెల్లడించాలి` అని ప్రశ్నించారు. `ఎటువంటి మందులు కొంటున్నాను - ఎటువంటి సినిమాలకు వెళ్తున్నాను - ఏ హోటళ్లలో ఉంటున్నాను - నా స్నేహితులు ఎవరన్న అంశాన్ని ప్రభుత్వం ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది?` అని చిదంబరం ఆధార్‌ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ఒకవేళ తాను ప్రభుత్వంలో ఉంటే - వ్యక్తిగత విషయాలను వెల్లడించేందుకు నిరాకరిస్తానని అన్నారు. అయితే దీనికి వెంట‌నే కౌంట‌ర్ రావ‌డం గ‌మ‌నార్హం.

ఇదే ఫెస్టివల్‌ కు హాజరైన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆధార్‌ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. మాజీ మంత్రి చిదంబరం మాట్లాడిన అంశాలన్నీ ఈ రోజుల్లో గూగుల్‌ లోనే దొరుకుతున్నాయని అన్నారు. అయితే వ్యక్తిగత విషయాలను భద్ర పరచడం ప్రభుత్వ కర్త‌వ్య‌మని - ఆ డిటైల్స్ ను హ్యాక్ చేయకుండా ఉండేందుకు పార్లమెంట్ చట్టం చేయాలని నారాయణ మూర్తి అన్నారు. కానీ ప్రభుత్వం గుడ్డిగా ఆధార్‌ ను అన్నింటితో లింక్ చేస్తోందని చిదంబరం ఆరోపించారు. ఇప్పటివరకు తాను తన ఆధార్‌ ను బ్యాంక్ అకౌంట్‌ తో లింక్ చేయలేదని, ఎవరు కూడా తమ ఆధార్ వివరాలను వెల్లడించరాదు అని, జనవరి 17న అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు అందరూ వేచి ఉండాలని చిదంబరం తెలిపారు. ప్రైవసీని రక్షించే చట్టాలు ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదని - ఫిల్మ్ టికెట్ బుక్ చేయడానికో - మరో అంశానికో ఆధార్ వివరాలు అవసరం లేదని నారాయణమూర్తి తెలిపారు.