Begin typing your search above and press return to search.

ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం సైజెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Oct 2015 4:39 AM GMT
ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం సైజెంతో తెలుసా?
X
చాలా సందర్భాల్లో ఓజోన్ పొరకు చిల్లు పడిందంటూ వార్తలు వింటుంటాం. ఈ రంధ్రం కారణంగా హాని కలిగించే అతినీలలోహిత కిరణాలు భూమి మీదకు పడతాయని.. దీని వల్ల చర్మవ్యాధులు.. రోగనిరోధక శక్తిని తగ్గించేయటం.. కళ్లల్లో శుక్లాలు.. క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలకు కారణం అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంటుంది. చాలామంది దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే.. చాలామంది దృష్టిలో ‘‘చిల్లు.. రంధ్రం’’గా చదివే పదాలు చాలా చిన్నగా ఉండటమే. నిజానికి ఓజోన్ పొరకు పడిన రంధ్రం సైజు వింటే ఒక్కసారి షాక్ తినాల్సిందే.

ఇష్టారాజ్యంగా మనిషి చేసే తప్పులకు మూల్యంగానే ఓజోన్ పొరకు చిల్లుగా చెప్పాలి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల్ని భూమి మీద పడకుండా అడ్డుకునే ఓజోన్ పొరను చేతులా చెడగొట్టుకున్న మనిషి.. దానికి సంబంధించి విపరిణామాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైనట్లే. శాస్త్రవేత్తల ఆందోళనలో అర్థం ఉందని తాజా సమాచారం స్పష్టం చేస్తుంది.

మనకు సదూర తీరాన ఉన్న అంటార్కిటికాలోని ఓజోన్ పొరకు పడిన రంధ్రం సైజు తెలిస్తే.. మప్పు మనకెంత దగ్గరగా ఉందన్న విషయం తెలుస్తుంది. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు చిల్లు పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడా రంధ్రం మరింత భారీగా తయారైందని చెబుతున్నారు. రికార్డు స్థాయిలో పెరిగిన ఈ రంధ్రం పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికాలో ఏర్పడిన ఈ రంధ్రం సైజు 28.2 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చెబుతున్నారు. ఇంకాస్త స్పష్టంగా.. తీవ్రత అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఓజోన్ పొరకు పడిన రంధ్రం విస్తీర్ణం 2కోట్ల 82 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ అంకె చూస్తేనే ముప్పు మనకెంత ఎక్కువగా ఉందో..?