ఓయో రూమ్స్ గురించి యువతకు పరిచయం చేయనవసరం లేదు. వివిధ రకాలైన లాడ్జీలు మరియు హోటల్ల నిర్వాహకులకు సైతం ఈ సేవల గురించి తెలిసిందే. అయితే, ఓయో రూమ్స్ విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క అని హైదరాబాద్ పోలీసులు తేల్చిచెప్తున్నారు.
హైదరాబాద్ పరిధిలోని ఓయో రూమ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రూమ్స్‌ల్లో పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బషీర్ బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నగరంలోని ఓయో రూమ్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి అని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ప్రతి ఓయో సెంటర్ వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచాలన్నారు. 6 నెలల స్టోరేజీని తప్పనిసరిగా భద్రపరచాలని ఆదేశించారు. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డుతో పాటు ఇతర వివరాలను కచ్చితంగా నోట్ చేసుకోవాలని సీపీ సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇదిలాఉండగా, డార్క్ నెట్ వెబ్‌సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 11 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల్లో సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులే అధికంగా ఉన్నారు. గతంలో కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులను వదిలేశామన్నారు. విద్యార్థులు మళ్లీ డ్రగ్స్ వాడుతున్నారని, అందుకే విద్యార్థులను అరెస్టు చేశామని ప్రకటించారు.