Begin typing your search above and press return to search.

'ఓయో'.. శుభ సమయంలో ఎంతటి విషాదం?

By:  Tupaki Desk   |   10 March 2023 9:27 PM GMT
ఓయో.. శుభ సమయంలో ఎంతటి విషాదం?
X
స్టార్టప్ ప్రపంచంలో సంచలనాలు కొన్ని.. అద్భుతాలు కొన్ని.. వస్తు సేవలరంగంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆహార పంపిణీలో జొమాటో, స్విగ్గీ.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు. ఇక ఆతిథ్య రంగంలో చెప్పుకోవాలంటే ‘‘ఓయో’’. తక్కువలో తక్కువగా హోటల్ రూమ్ ల బుకింగ్ అంటే ‘‘ఓయో’’నే. అంతగా విజయవంతం అయిందీ స్టార్టప్. అలాంటి ఓయో ఆవిష్కర్త భారతీయుడే. అందులోనూ అతడేమీ కాకలు తీరిన వ్యాపారవేత్త కాదు. అవివాహిత యువకుడు. ఆ యువకుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. అంతలోనే వారింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఎందుకలా జరిగింది?

ఓయో వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్. ఈ నెల 7న అతడి వివాహం ఘనంగా జరిగింది. ప్రముఖులు పలువురు దీనికి హాజరయ్యారు. చిన్న వయసులోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు రితేశ్. ఆయన తండ్రి రమేశ్‌ అగర్వాల్‌ శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి పడి మరణించారు. రితేశ్ పెళ్లైన 3 రోజులకే ఇలాంటి విషాదం చోటుచేసుకుంది.

రమేశ్ అగర్వాల్ గురుగ్రామ్‌లో ఉంటున్నారు. ఆయన 20వ అంతస్తు నుంచి పడి మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 54లో ఉన్న డీఎల్‌ఎఫ్‌కు చెందిన ది క్రెస్ట్‌ సొసైటీలో రితేశ్‌ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రమేశ్‌ అగర్వాల్‌ పై అంతస్తు నుంచి కిందపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

కుటుంబం అదే ఇంట్లో..

రితేశ్ తల్లిదండ్రులతో కలిసి గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 54లో నివసిస్తున్నారు. రమేశ్ ప్రమాదానికి గురైన సమయంలో ఆయన భార్య, కుమారుడు రితేశ్, కోడలు అదే ఇంట్లో ఉన్నారు. కాగా, ఆస్ప్రతిలో రమేశ్ బాడీకి పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, రమేశ్ మరణంపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, ఎలాంటి సూసైడ్‌ నోటు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. తండ్రి అనూహ్య మరణంతో రితేశ్ హతాశుడయ్యారు.

ఇలాంటి సమయంలో కాస్త వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. తన తండ్రి మరణం తమకు తీరని లోటు అని చెప్పారు. కాగా, రితేశ్ వివాహానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్‌, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ, లెన్స్‌కార్ట్‌ నిర్వాహకులు పీయూష్‌ బన్సల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి వంటి కార్పొరేట్‌ ప్రముఖులు హాజరయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.